తాగునీరు, మజ్జిగ వితరణ అభినందనీయం

తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సూపరింటెండెంటింగ్‌ ఇంజినీర్‌ సాల్మన్‌ రాజు
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
వేసవిలో తాగునీరు, మజ్జిగ అందించడం పుణ్యకార్యమని తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సూపరింటెండెండింగ్‌ ఇంజినీర్‌ సాల్మన్‌ రాజు చెప్పారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉద్యోగులచే ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రంలో గురువారం ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాల్మన్‌రాజు మాట్లాడుతూ తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉద్యోగులు సామజిక బాధ్యతగా ప్రతి ఏడాది ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, ప్రజలకు సేవలందిస్తున్నారని అభినందించారు. ఏలూరు పరిసర గ్రామాల ప్రజలు ఏలూరు పట్టణానికి ఎంతో మంది ప్రజలు వివిధ పనులపై వస్తుంటారని, ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వేడి గాలులు ఎక్కువగా వీయడంతో సామాన్య ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఏప్రిల్‌ 14 నుంచి రోజుకు 150 లీటర్ల పైగా విజయ డెయిరీ ద్వారా మజ్జిగ కొనుగోలు చేసి, రోజుకు వెయ్యి మందికి పైగా ప్రజలకు ఈ కేంద్రం ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాల వద్ద ఉండడంతో వివిధ కారణాలతో పట్టణానికి వచ్చే ప్రజలకు ఉచిత మజ్జిగ ద్వారా దాహార్తిని తీర్చడం ఎంతో మంచి పుణ్యకార్యమని సాల్మన్‌ రాజు చెప్పారు. జిల్లా పౌర సంబందాధికారి ఆర్‌విఎస్‌. రామచంద్రరావు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సిబ్బంది ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఇఇ జెపి బి.నటరాజన్‌, అదనపు ఇఇ డి.ప్రసన్నవల్లి, ఎజి.సత్యనారాయణ, ఎస్‌.బలుసుబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️