విజ్ఞాన కేంద్రాలు.. వేసవి వినోద శిబిరాలు

బాల బాలికల్లో వినోదంతోపాటు సైన్స్‌, సృజనాత్మకత పెంపు
చిల్డ్రన్స్‌ క్లబ్‌ కృషి పట్ల సర్వత్రా హర్షం
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ప్రపంచ దేశాల్లో భారతదేశం వెనుకబడి ఉండటానికి కారణాల్లో ఒకటి మూఢ నమ్మకాలు… దేశం వెలిగిపోతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉందని, ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తుందని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమాజంలో మార్పు కోసం కందుకూరి వీరేశలింగం, జ్యోతిరావు పూలే, డాక్టర్‌ అంబేద్కర్‌ వంటి సంఘసంస్కర్తలు, ఎందరో మహానుభావులు కృషి చేసినప్పటికీ ఫలితాలు పరిమితంగానే వచ్చాయి. ప్రస్తుత పాలకుల తీరు, సోషల్‌ మీడియా ఈ మూఢనమ్మకాలను మరింత పెంచి పోషిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాల్యం నుంచే విద్యార్థుల్లో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించి సైన్స్‌ ప్రయోజనాలు, ప్రాముఖ్యత, జీవితంలో సైన్స్‌ పాత్ర గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు హేలాపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల సాధన సమితి తదితర సంఘాలతో సమన్వయం చేసుకుని ఏలూరు నగరంలో 20 కేంద్రాల్లో దిగ్విజయంగా వేసవి వినోద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. హేలపురి చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏలూరులో ఐదు సంవత్సరాల నుండి ప్రతియేటా వేసవి సెలవుల్లో విద్యార్థులకు వేసవి వినోద శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రస్తుతం ఏలూరులో గన్‌బజార్‌, వంగాయగూడెం, పోణంగి వైఎస్‌ఆర్‌ కాలనీ, బాలల గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయం, శనివారపుపేట, సుందరయ్య కాలనీ, తంగెళ్లమూడి, గాంధీనగర్‌, అల్లూరి సీతారామరాజు కాలనీ తదితర ప్రాంతాల్లో సుమారు 20 కేంద్రాల్లో ఈ సమ్మర్‌ క్యాంపులు నడుపుతున్నారు. సెలవుల్లో ఇంటి వద్దనే ఉండే విద్యార్థులకు వారి నివాస ప్రాంతాల్లోనే శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్యతోపాటు సమాజంలో అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించడం, మూఢనమ్మకాలను పారదోలుతూ సైన్స్‌ భావజాలం పెంపొందించేలా ఈ క్యాంపుల్లో నేర్పుతున్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, వికాసం కలిగించేలా ఆటలు, పాటలు, డ్యాన్స్‌, కోలాటం, డ్రాయింగ్‌, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌ వంటివి నేర్పుతున్నారు. ఆడ పిల్లలకు ఆత్మ రక్షణకు ఉపయోగపడే కరాటే, గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ వంటి సెల్ఫ్‌ టెక్నిక్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మహానేతల జీవిత చరిత్ర విశేషాలను వీడియోల ద్వారా పిల్లలకు తెలియజేస్తున్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా పిల్లల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. సెలవు రోజులు కావడంతో విద్యార్థులు చిల్డ్రన్స్‌ క్లబ్‌ సమ్మర్‌ క్యాంపుల్లో ఉత్సాహంగా పాల్గొం టున్నారు. ప్రతి క్యాంపులో సుమారు 20 నుంచి గరిష్టంగా 50 మంది వరకు పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన ఈ క్యాంపులు ఈ నెల 10వ తేదీ వరకు నడిచాయి. అనంతరం ఎన్నికల కారణంగా ఐదు రోజులు విరామం ఇచ్చి మళ్లీ మే 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీ వరకు, మరికొన్ని కేంద్రాల్లో జూన్‌ ఏడో తేదీ వరకు ఈ క్యాంపులు జరగనున్నాయి. మూఢ నమ్మకాలను బాల బాలికలకు వివరించి సైన్స్‌ ప్రయోగాల ద్వారా నిజాలను పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చిన్నచిన్న డ్రామాలు ప్రదర్శించడం, దొంగ బాబాలు చేసే చిన్న చిన్న ట్రిక్స్‌ను మ్యాజిక్‌ షో ద్వారా బహిర్గతం చేయడం వంటివి చేసి అన్నింటికీ మూలం సైన్స్‌ మాత్రమే అని తెలియజేస్తున్నారు. అంతేకాక చిత్రలేఖనంలో పెన్సిల్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌ వంటివి విద్యార్థులకు నేర్పిస్తున్నారు. పాటలు పాడటం, పద్యాలు, వాటి భావం నేర్పించడం, నీతి కథలు నేర్పించడం వంటివి చేస్తున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 11:30 వరకు సాగే ఈ క్యాంపుల్లో విద్యార్థులకు అల్పాహారం, మజ్జిగ, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, లస్సీ వంటివి అందిస్తున్నారు. వేసవి సెలవుల్లో టీవీలతోనూ, సెల్‌ఫోన్లతోనూ విద్యార్థులు కాలక్షేపం చేయకుండా ఇటు సమాజం పట్ల అవగాహన, బాధ్యత అలవర్చుకోవడంతోపాటు నమ్మకాలకు, నిజాలకు మధ్య వ్యత్యాసం ఉంటుందనే విషయాన్ని సైన్స్‌ ద్వారా గ్రహించి దేశ భవిష్యత్తు కోసం, మెరుగైన సమాజం కోసం విద్యార్థులు భవిష్యత్తులో పాటుపడేందుకు ఈ సమ్మర్‌ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయి అనేందుకు ఎలాంటి సందేహమూ లేదు. భవిష్యత్తులో ఇలాంటి సమ్మర్‌ క్యాంపులు మరిన్ని నిర్వహించాలనేది అందరి ఆకాంక్ష.

➡️