ప్రపంచ మానవాళి దోపిడీకి సోషలిజమే మార్గం

లెనిన్‌ జయంతి వేడుకలో వక్తలు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
ప్రపంచ మానవాళి దోపిడీ విముక్తికి సోషలిజమే మార్గమని చాటి చెప్పింది విఐ.లెనిన్‌ అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ కొనియాడారు. సోమవారం లెనిన్‌ జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో లెనిన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం ఆఫీస్‌ కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిషోర్‌ మాట్లాడుతూ ప్రపం చంలో దోపిడీ నుంచి మానవులకు విముక్తి కలిగించేది సోషలిజం, కమ్యూనిజం మాత్రమేనని, దాన్ని ఆచరణలో నిరూపించింది లెనిన్‌ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రను పరిశీలించి, పరిశోధించి మానవాళి దోపిడీ విముక్తికి మార్గాన్ని కార్ల్‌మార్క్స్‌ వెతికితే, దాన్ని ఆచరణలో తీసుకొచ్చింది లెనిన్‌ అని అన్నారు. లెనిన్‌ తెచ్చిన సోవియట్‌ యూనియన్‌ విప్లవం తర్వాత ప్రపంచంలో అనేక వలస దేశాలు తమ తమ బానిసత్వం నుంచి విముక్తి కోసం స్వాతంత్ర పోరాటాలు సాగించాయన్నారు. సోషలిస్టు రష్యా విప్లవం తర్వాతనే మన భారతదేశంలో కూడా స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. స్వాతంత్ర భారతదేశానికి ప్రారంభంలో సోషలిస్ట్‌ రష్యా (లెనిన్‌) ప్రభుత్వం చాలా సహకారం అందించిందని తెలిపారు. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తమ దేశంలో కూడా సోషలిస్ట్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించ డమే దానికి నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాలకు లెనిన్‌ చూపిన మార్గం నేటికి అనుసరణీయమన్నారు. లెనిన్‌ ఎంతటి గొప్పవాడు అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన మృతదేహాన్ని రష్యన్‌ ప్రజలు భద్రపరుచుకున్నారని తెలిపారు. భారతదేశంలో కూడా సోషలిస్టు వ్యవస్థ కోసం సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. సోషలిస్టు వ్యవస్థ ఎంతైనా అవసరమని, దానికోసం ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.జగన్నాధరావు, మీసాల సత్యం, గనిగంటి కోటేశ్వరరావు, బి.త్రినాధ్‌, వి.ఠాగూర్‌, ఎం.సింహాచలం పాల్గొన్నారు.

➡️