ఉపాధి హామీ పనులు చాలడం లేదు

Apr 21,2024 00:13

పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడుతున్న జి.రవిబాబు
ప్రజాశక్తి – క్రోసూరు :
ఉపాధి హామీ పని దినాలను ఏడాదికి 200 రోజులకు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉయ్యందనంలో ఉపాధి హామీ పని ప్రదేశాలను ఆయన శనివారం సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పనులు చాలినంతగా ఉండడం లేదని, ఇప్పటికే వర్షాల్లేక వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయాయని కూలీలు వాపోయారు. ముగ్గురు సభ్యులున్న కుటుంబం 5 వారాలు పని చేస్తేనే వంద పని దినాలు పూర్తవుతాయని, మిగతా రోజులు ఎలా బతకాలని ఆవేదనకు గురయ్యారు. కొత్తగా పెళ్లయిన వారికి పాత జాబ్‌కార్డులో నుంచి తొలగించి కొత్త జాబ్‌ కార్డులు ఇవ్వకపోవడం వలన కూడా పని దినాలు చాలటం లేదని చెప్పారు. అనంతరం రవిబాబు మాట్లాడుతూ పనిదినాల పెంపుతోపాటు రోజుకులి రూ.500కు పెంచాలని, సమ్మర్‌ అలవెన్స్‌ 40 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనిముట్లు, తాగునీటి అలవెన్సులనూ ఇవ్వాలన్నారు. ఈ సమస్యలపై సంఘం చేసే పోరాటాల్లో కూలీలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉయ్యందనంలో ఎక్కువ కుటుంబాలు ఉపాధి హామీ పనులు చేస్తున్నాయని, ఇలాంటి పంచాయతీలకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వా లని కోరారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమం తరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఏపూరి వెంకటేశ్వర్లు, మేట్‌లు నరేష్‌, అశోక్‌ పాల్గొన్నారు.

➡️