ప్రతి ఖర్చునూ నమోదు చేయాలి: వ్యయ పరిశీలకులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి పోలింగ్‌ జరిగే వరకు చేసే ప్రతి ఖర్చునూ వ్యయ పరిశీలన బృందాలు నిశితంగా పరిశీలిస్తూ నమోదు చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సాతే సందీప్‌ ప్రదీప్‌రావు సూచించారు. శనివారం యర్రగొండపాలెంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని బృందాలూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల రహిత ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. బ్యాంకు ఖాతాలతో పాటు డిజిటల్‌ లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలను తనిఖీ చేయాలని, ర్యాలీలు, సమావేశాలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయించిన ధర ప్రకారం ఖర్చులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, అన్ని టీముల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి డాక్టర్‌ పి శ్రీలేఖ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️