ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

May 11,2024 21:08

జిల్లాలో 7,83,440మంది ఓటర్లు

1031 పోలింగ్‌ కేంద్రాలు

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం మేరకు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని ఆయన కోరారు. యువత, మహిళలు, పివిటిజిలు, థర్డ్‌ జెండర్‌ ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఎన్నికలకు ఇప్పటి వరకు అన్ని ప్రశాంతంగా, సజావుగా ఏర్పాట్లు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని కలెక్టర్‌ అన్నారు. ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. సాయంత్రం 6గంటల నుంచి మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు. ఇది ఈనెల 13 సాయంత్రం 7 గంటల వరకు సాగుతుందన్నారు. జిల్లాలో 604 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. రూ. 2కోట్ల విలువగల 61 వేల మద్యం సీజ్‌ చేశామని, 2019 ఎన్నికల్లో సీజ్‌ చేసిన దానికి ఇది పది రెట్లు అని వివరించారు. నియోజక వర్గంలో ఓటు హక్కు ఉన్నవారు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు 298 వాహనాలను వినియోగిస్తున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 7,83,440మంది ఓటర్లకు గానూ ఇప్పటి వరకు 7,63,608 ఓటరు స్లీప్‌ లు పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 4529 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 4,776 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినట్లు, అబ్సెంట్‌ ఓటర్లు (ఇంటివద్ద లభ్యం కానివారు) 10527 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు జిల్లాలో 1031 పోలింగు స్టేషన్లలో 883 పోలింగు స్టేషన్లు సాధారణ పోలింగు స్టేషన్లు, 219 క్రిటికల్‌ పోలింగు స్టేషన్లుగా గుర్తించి ఏర్పాట్లు చేశామన్నారు. 443 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. నేడు ఎన్నికల సామగ్రి పంపిణీఎన్నికల సామగ్రి పంపిణీ ఆదివారం ఉదయం ప్రారంభమవు తుందని కలెక్టర్‌ చెప్పారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోను, సాలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అధికారులు, సిబ్బంది ఆదివారం ఉదయం 7గంటలకు రిపోర్ట్‌ చేయాలని ఆయన చెప్పారు. ఎన్నికలకు దాదాపు 6,600 మంది సిబ్బంది, 127మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల సామగ్రి స్వీకరణ, స్ట్రాంగ్‌ రూంలను ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉద్యాన కళాశాలలో కౌంటింగు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో – ములిగూడ, బత్తిలి, భామిని, పి కోనవలస, కోనేరు కూడళ్ళ లోను, గునుపూర్‌, పద్మాపూర్‌, దండిగాం, ఆర్‌ కె బట్టివలస, అడారు వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ అవసరం లేదుపోలింగ్‌ ఏజెంట్లు నేరుగా పోలింగ్‌ కేంద్రాల్లోకి చేరుకోవచ్చని, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రిసైడింగ్‌ అధికారి నియామక పత్రాలను జారీ చేస్తారని ఆయన చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ అవసరం లేదన్నారు వెరిఫికేషన్‌ జరగదని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో తగాదాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 1150 మంది పోలీసు సిబ్బంది, ఆరు కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నమని చెప్పారు. 56 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బందాలు, 138 సెక్టార్‌ అధికారులను నియమించామని తెలిపారు. 6,100 మందిపై బైండ్‌ ఓవర్‌ కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల వేళ ఎవరూ సమస్యలు, అల్లర్లు సృష్టించారాదని కోరారు. అల్లర్లు సష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఓటు లేని ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లా విడిచి వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.

➡️