40 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్ను

ప్రభుత్వ స్థలాన్ని చదును చేసిన దృశ్యం

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట

మండలంలోని రాజాం సర్వే నెంబర్‌ 233లో ఊరకొండను ఆనుకొని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడానికి ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ 40 ఎకరాల భూమి రాజాం, థైపురం, చిట్టియ్యపాలెం, తురకలపూడి తదితర గ్రామాలను ఆనుకొని ఉంది. ఈ భూమి తమకు కావాలంటే, తమకు కావాలని 10 సంవత్సరాల నుండి ఆయా గ్రామాలకు చెందినవారు ఘర్షణ పడుతున్నారు. ఏడాది క్రితం సదరు భూముల్లోని యూకలిప్టస్‌ తోటల కోసం రాజాం, చిట్టియ్యపాలెం గ్రామాలకు చెందిన వారు సైతం ఘర్షణ పడ్డారు. ఈ భూములు అనకాపల్లి -తట్టబంద మార్గంలో రోడ్డు పక్కనే ఉండడంతో పాటు, ఒక్కో ఎకరా రూ.50లక్షల నుండి రూ.60లక్షలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఇప్పుడు ఈ భూములను దక్కించుకోవడానికి కొంతమంది ఆర్మీ ఉద్యోగులు, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బందితో సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం. ఈ భూమిని కాజేయడానికి కొంత మంది దానిని చదును కూడా చేయించారు. అయితే ఆయా గ్రామాల్లోని భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన ఈ భూమిని పెద్దలు కొట్టేయడానికి చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సదరు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిజంగా భూమి లేని పేదలకు ఆ భూమిని పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️