వ్యవసాయ విద్యార్ధులచే ” రైతు సదస్సు.. ప్రదర్శన ”

Jan 30,2024 15:38 #agriculture student, #Kakinada

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ”రైతు సదస్సు-ప్రదర్శన” నిర్వహించారు. ఈ సదస్సు, ప్రదర్శన ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శనను వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ చవాన్‌ శ్యామ్‌ రాజ్‌ నాయక్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు అభ్యుదయ రైతుల కమతాలలో వారసత్వంగా వస్తున్న సాంప్రదాయ వ్యవసాయ విధానాలు రైతుల వద్ద నుండి నేర్చుకుని తమకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జత కలిపి తక్కువ నీటి వసతి,తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన అధిక దిగుబడులు ద్వారా అధికాదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు.సమగ్ర సస్యరక్షణ,ఎలుకల నివారణ,మిద్దె తోటల పెంపకం,నేల ఆచ్చాదన పద్ధతులు,నీటి సంరక్షణ,వానపాముల ఎరువు తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సిహెచ్‌ వి నరసింహారావు వ్యవసాయ విద్యార్థులు అభ్యుదయ రైతులతో మమేకమై సాధించిన అన్ని అంశాలను తమ అనుభవంతో గ్రంథస్తం చేస్తున్నారన్నారు.విద్యార్థులు వ్యవసాయ విస్తరణాధికారులుగా రైతులకు మరింత మెరుగైన సేవలందిస్తారన్నారు.ఈ సదస్సులో గ్రామ సర్పంచ్‌ పచ్చిపాల సతీష్‌ కుమార్‌,వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్‌ పి మునిరత్నం,ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి ఉషారాణి,డాక్టర్‌ ఏ సీతారామ శర్మ,మండల వ్యవసాయ అధికారి కే సంజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️