ఇవిఎంల్లో అభ్యర్థుల భవితవ్యం

May 14,2024 22:12

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఇచ్చిన తీర్పు జూన్‌ 4న వెలువడనుంది. ఇవిఎం బాక్సులన్నీ మంగళవారం మధ్యాహ్నానికి కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ వర్శిటీ, జొన్నాడ వద్ద లెండి ఇంజినీరింగ్‌ కాలేజీలోని రిషప్షన్‌ కేంద్రాలకు పూర్తిస్థాయిలో చేరాయి. బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల ఓట్లు జెఎన్‌టియులోను, మిగిలినవి లెండి కాలేజీలోనూ భద్రపరిచారు. కౌంటింగ్‌ రోజున విజయనగరం లోక్‌సభ ఓట్ల వివరాలు కూడా లెండీలోనే ప్రకటిస్తారు. పార్వతీపురం మన్యంలోని పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల కౌంటింగ్‌ పార్వతీపురంలోని ప్రభుత్వ ఉద్యాన కళాశాలలో జరుగుతాయి. ఇవిఎంలు కూడా అక్కడికే తరలించి భద్రపర్చారు. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్న అభ్యర్థులు మంగళవారం సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలవారీగా ఓట్ల సరళిని బట్టి అంచనాలు వేశారు. ముఖ్యంగా ప్రాధాన పార్టీలుగావున్న వైసిపి, టిడిపి అభ్యర్థులు, వారి తరపున ఎన్నికల్లో పనిచేసిన నాయకులు కూడికలు, తీసివేతలలో తలమునకలయ్యారు. బూత్‌ల వారీ వివరాలు రప్పించుకొని, ఏ కేంద్రంలో తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. ప్రత్యర్థికి వచ్చే ఓట్లు ఎన్ని బేరీజు వేసుకుంటున్నారు. ఒకటికి పదిసార్లు అంచనాలు వేస్తున్నారు. ఎవరికి వారే దీమాలు వ్యక్తం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది మంగళవారం రాత్రి వరకూ తేలలేదు. అంచనాలు వాటిపైనే ఆధాపడివుండడంతో రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు వాటికోసం కళ్లు కడగండ్లు కాసేలా ఎదురు చూశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య గట్టిపోటీ కనిపిస్తోంది. వివిధ సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు, పింఛన్లు అందుకున్న వృద్ధులు, వికలాంగులు, వింతవులు తమకే ఓట్లు వేశారన్న ఆశాభావం వైసిపి నాయకుల నోట వినిపిస్తోంది. కానీ, ఈ ఎన్నికల్లో యువకులు, అందులోనూ కొత్త ఓటర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వలసకుటుంబాల ఓట్లు గెలుపు, ఓటములను నిర్ధేశించనున్నాయి. వీటిలో ఎక్కువగా టిడిపికి పడడ్డాయనేది ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఈసారి సుదూర ప్రాంతాల్లోవుంటున్న వలస ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులు వీరిని రప్పించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఓట్లు ఎవరికి వేశారన్నది అనుమానమే.

➡️