ఎట్టకేలకు  విశాఖ ఉక్కుకు కొకింగ్‌ కోల్‌, లైమ్‌స్టోన్‌

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌

ప్రజాశక్తి – ఉక్కునగరం : హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా కలెక్టర్‌, సిటీ పోలీస్‌ కమిషనర్‌ అదానీ గంగవరం పోర్టు యాజమాన్యంతోనూ, కార్మికులతోనూ జరిపిన చర్చలు కొంత సానుకూలంగా సాగడంతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కి గంగవరం పోర్టు నుంచి కొకింగ్‌ కోల్‌, లైమ్‌ స్టోన్‌ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రావడం ప్రారంభమైంది. ఎ-షిఫ్ట్‌లో 4248 ఎంటి, బి – షిఫ్ట్‌లో ఐదు గంటలకు 2300 ఎమ్‌టి మొత్తంగా శుక్రవారం రాత్రికి 15000 ఎమ్‌టి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లైమ్‌ స్టోన్‌ 4200 మెట్రిక్‌ టన్నులు ఒక ర్యాక్‌లో లోడై విశాఖ ఉక్కు కర్మాగారంలో దిగింది. 15 రోజుల్లో గంగవరం పోర్టులో ఉన్న 3 లక్షలా 25 వేల టన్నుల సరుకును విశాఖ ఉక్కుకు తరలించనున్నారు. అలాగే మరో కోకింగ్‌ కోల్‌ వెస్సెల్‌ 22వ తేదీ నాటికి అమెరికా నుంచి 79 వేల మెట్రిక్‌ టన్నుల మేర రానుంది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో సాధారణ ఉత్పత్తి దిశగా ప్లాంట్‌ నడిచే అవకాశముంది. ఇప్పటికైనా స్టీల్‌ యాజమాన్యం ఉద్యోగులకు జీతాలు చెల్లించి పూర్తిస్థాయి ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️