అభ్యర్థుల్లో ఆర్థికమే కీలకం

Feb 21,2024 23:37

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్హత ఆర్థిక స్థోమత కీలకంగా మారింది. సాధారణ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఈసారి మచ్చుకయినా కన్పించడం లేదు. ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపిలు అభ్యర్థుల ఎంపికలో భారీగా పెట్టుబడి పెట్టేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు? పార్టీని అంటిపెట్టుకుని ఎన్ని ఏళ్లు నియోజకవర్గానికి సేవలందించారు? పార్టీ నాయకులతో ఉన్న సత్సంబంధాలు తదితర అంశాలు వేటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం ఆర్ధిక స్థోమత ఉందా లేదా అన్న కోణంలోనే వైసిపి అభ్యర్థుల ఎంపికను చేపట్టింది. అంతేగాక తాను మీరు అడిగినంత ఖర్చుపెట్టలేనని నిష్కర్షగా చెప్పిన అభ్యర్థులకు టిక్కెట్‌ ఇవ్వలేమని అధిష్టానం స్పష్టం చేస్తోంది. గుంటూరు ఎంపిగా అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి ఇదే కారణంగా నిలిచింది. దీంతో పార్టీలో సీనియర్‌ అయినా స్థానికంగా మీకు వ్యతిరేకత ఉంది. మీరు గెలవలేరు అనే అంశాన్ని ఒక సాకుగా చూపుతున్నారు.ఒక చోట చెల్లని కాసు మరో చోట చెల్లుతుందా అని ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ప్రస్తుతం జిల్లాలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఆర్ధిక అంశాలే కీలకంగా ఎంపికలు జరిగాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పోటీగా అసెంబ్లీ స్థానానికి అయితే రూ.30 నుంచి రూ.40 కోట్లు, పార్లమెంటుకు అయితే రూ.100 నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేయాలని షరతుపెట్టి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. వైసిపి బాటలోనే టిడిపి కూడా పయనిస్తోంది. పార్టీలో సీనియారిటీ కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేస్తారు? అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసిన వారి కన్నా ప్రత్యర్థిపార్టీ కన్నా ఎక్కువ ఖర్చుపెట్టగల స్థోమత ఉన్న వారికి అవకాశం ఇస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు, రియల్టర్లు, కార్పొరేట్‌ వ్యాపార దిగ్గజాలకు రెడ్‌ కార్పేట్‌ వేస్తున్నారు. దీంతో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని కనీసం కూర్చొబెట్టి మాట్లాడిన పరిస్థితులు లేవు. వేర్వేరు కారణాలతో మీకు ఈసారికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. భవిష్యత్తులో అయినా మంచి హోదా కల్పిస్తాం అని ఒకరిద్దరు ఇన్‌ఛార్జిలకు తప్ప పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఏమాత్రం భరోసా దక్కడం లేదు. వైసిపిలో జంబ్లింగ్‌ విధానం పాటిస్తుండగా టిడిపిలో కొత్త వారికి ఛాన్సు ఇచ్చి ఎక్కువ మంది పాత వారిని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్ధిక అంశం కీలకం కావడంతో టిడిపి,వైసిపిలకు ఎంపి అభ్యర్థుల కోసం కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీలో చేరకుండానే టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ముందుగానే ఫలానా స్థానం నుంచిపోటీ చేయడానికి ఒప్పందం చేసుకుని కార్పొరేట్‌రంగానికి చెందిన వారు పార్టీలోకి వస్తున్నారు. పార్టీకి వారు చేసిన సేవలు ఏమీ లేకపోయినా కేవలం డబ్బు ప్రమాణికంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలపైపోరాడి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని పోలీసు కేసులతో ఇబ్బంది పడుతున్న నేతలకు కూడా గుర్తింపులేకుండా పోయింది. ఆయాపార్టీల అధినాయకులు కోరుతున్నంత పెట్టుబడి పెట్టలేనివారు స్వచ్చందంగా పోటీ నుంచితప్పుకుంటున్నారు. మరికొంత మంది పార్లమెంటుకు మా వల్ల కాదు..అసెంబ్లీకి వెళ్తామని సర్ధుకుంటున్నారు.

➡️