ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి

Apr 20,2024 21:00

బ్యాంకు డిపోజిట్లపై దృష్టి

రాష్ట్ర వ్యయ పరిశీలుకులు

ప్రజాశక్తి- విజయనగరం : ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అధికారులు అందరిపట్లా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రంజన్‌, ఆనంద్‌ కుమార్‌, ఆకాశ దీప్‌లతో కలసి ఆమె శనివారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి జిల్లాలో చేపట్టిన ఎన్‌ ఫోర్సుమేంట్‌ ప్రణాళికను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. 4 చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసామని, విస్తృత తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వస్తు, ధన రూపేణా రూ.4.2 కోట్ల నగదును సీజ్‌ చేశామన్నారు. ఫిర్యాదుల స్వీకరణ, మీడియా పర్యవేక్షణ, మోడల్‌ కోడ్‌ అమలు, సి విజిల్‌ తదితర సేవల కోసం 24/7 పని చేసేలా కంట్రోల్‌ రూమ్‌ నుంచి సేవలందిస్తున్నామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.నిష్పక్షపాతంగా వ్యవహరించాలిఈ సందర్భంగా రాష్ట్ర వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అధికారులంతా తప్పక పాటించాలని సూచించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు అందరిపట్లా ఒకేలా వ్యవహరించాలని సూచించారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలను పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో జప్తు చేసిన నగదు, వస్తువుల వివరాలను ఈఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేయాలన్నారు. జప్తు చేసిన వస్తువులు, నగదు పై కూడా దృష్టి ఉంచాలని తెలిపారు. బ్యాంకు లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్‌, రెవెన్యూ, స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో, డీఆర్‌ఐ, పోస్టల్‌, కస్టమ్స్‌, ఇన్‌ కంటాక్స్‌, బ్యాంకు, అటవీ, రైల్వే, ఐ.టి, జి.ఎస్‌.టి రవాణా తదితర శాఖల అధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. సమావేశంలో జాయింట కలెక్టర్‌ కార్తీక్‌, జిల్లా ఎస్‌.పి దీపికా పాటిల్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, అదనపు ఎస్‌.పి అస్మ ఫరీన్‌, డిఆర్‌ఒ అనిత, వ్యవ బృందాలు తదితరులు పాల్గొన్నారు.

➡️