కాలువల ఆధునీకరణకు పాతర!

ప్రజాశక్తి – సింహాద్రిపురం నియోజవర్గంలోని ప్రధాన సాగునీటి వనరులైన పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌, పైడిపాలెం ప్రాజెక్టు కాలువలు ఆధునీకరణకు నోచుకోలేదు. దీని కారణంగా కాలువలలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో నీటి సరఫరాలో ఆటంకం కలుగుతోంది. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పిబిసి) పరిధిలోని సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, లింగాల, వేముల మండలాలకు సంబంధించి 54,000 ఎకరాలలో ఆయకట్టు భూమి ఉంది. ఈ ఆయకట్టుకు పార్నపల్లి సమీపంలోని ఉన్న చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసేవారు. అయితే పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ఆ ప్రాజెక్టు నుంచి హిమకుంట్ల చెరువుకు పంపింగ్‌ చేసి అక్కడి నుంచి పిబిసి కాలువలోకి పంపింగ్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు. అయితే పైడిపాలెం రిజర్వాయర్‌ నుంచి వచ్చే కాలువలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరగడంతో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీంతో డ్యామ్‌ నుంచి 100 క్యూసెక్కుల నీరు మాత్రమే వదులుతున్నారు. తొండూరు డిస్ట్రిబ్యూటరీ పరిధి లోని కాలువలో సైతంగడ్డి( జంబు) అధికంగా పెరిగింది. ఈ రెండు కాలువలలో గడ్డి, మట్టి, ఇతర పిచ్చి మొక్కల కారణంగా నీటి సరఫరా ఆటంకం కలుగుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో కాలువలలో నీటి సరఫరా నిపివేశారు. కావున సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కాలువలోని పూడికను తొలగించాలని రైతులు కోరుతున్నారు.అసంపూర్తిగా పనులు.. తొండూరు డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని కాలువలలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి( జంబు) ను ఉపాధి కూలీలచే పనులు చేయించారు. అయితే ఈ పనులు అసంపూర్తి జరిగాయి. కేవలం కూలీలు జంబు గడ్డిని పైపైన మాత్రమే తొలగించారు. అధికారులు జెసిబిలు సాయంతో పూర్తిస్థాయిలో కాలువలలో మట్టి, రాళ్లు, గడ్డిని బయటికి తొలగించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.కాలువలలో గడ్డి, మట్టిని తొలగించాలి పైడిపాలెం, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ కాల్వలలో పేరుకుపోయిన గడ్డి, మట్టి రాళ్లను సైతం బయటికి తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. దీని కారణంగా నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుంది. కావున అధి కారులు చర్యలు తీసుకొని వాటిని తొలగించాలి.- మహేశ్వర్‌ రెడ్డి, రైతు, సింహాద్రిపురం.మా దష్టికి వచ్చింది పైడిపాలెం ప్రాజెక్టు నుంచి హిమకుంట్ల చెరువు వరకు ఉన్న కాలువలలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటి తొలగింపు పనులు త్వరలోనే చేపట్టి పూర్తిస్థాయిలో కాలువలో లేకుండా చర్యలు తీసుకుంటాం.-శ్రీనివాస్‌, డిఇఇ, జికెఎల్‌ఐ ప్రాజెక్టు.

➡️