ఆమె ఓటుపై గంపెడాశ

May 16,2024 00:22

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పోలింగ్‌పై ప్రధాన పార్టీల్లో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 88 శాతం వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై టిడిపి, వైసిపిల్లో కూడా ధీమా వ్యక్తం అవుతోంది. గుంటూరు జిల్లాలో కూడా 2019లో 72 శాతం పోలింగ్‌ జరగ్గా ఇప్పుడు 78.81 శాతం పోలింగ్‌ జరిగింది. జిల్లాలో మొత్తం 17,91,543 మంది ఓటర్లు ఉండగా 14,11,989 మంది తమ ఓ టు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్‌ బుధవారం తాజాగా విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఓటు వేసిన వారిలో పురుషులు 6,85,984 మంది ఉండగా మహిళలు 7,25,943 మంది ఉన్నారు. పల్నాడు జిల్లాలో గత ఎన్నికలలో 80 శాతం పోలింగ్‌ జరగ్గా ఈసారి 85.65 శాతం ఓట్లుపోలయ్యాయి. మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉండగా 14,85, 909 ఓట్లుపోలయ్యాయి. వీరిలో 7,27,560 మంది పురుషులు, 8,81,485 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పురుషుల కంటే మహిళల ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. రెండు జిల్లాల్లో మహిళల ఓట్లు పోలవడంపై వైసిపి, టిడిపి ఇద్దరూ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు ఎక్కువగా పొందిన మహిళలు పోలింగ్‌కు భారీగా తరలిరావడం తమకు సానుకూలంగా వైసిపి నాయకులు చెబుతున్నారు. అయితే మహిళల్లో వ్యతిరేకత వల్ల ఎక్కువమంది పోలింగ్‌కు వచ్చి టిడిపికి అనుకూలంగా ఓటు వేశారని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. రాజధాని తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలంలో మహిళల ఓట్లు 90 శాతంకు పైగా పోలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు, మహిళల ఓట్లు తమకు దక్కుతాయని తద్వారా తమకు భారీగా వస్తాయని ఆశిస్తున్నట్టు టిడిపి నాయకులు తెలిపారు. పోలింగ్‌ రోజున టిడిపి, వైసిపి కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రత్యర్థి పార్టీ ఓడిపోతుందంటూ ప్రత్యేక సర్వేల పేరుతో పోస్టింగ్‌లు పెట్టి రకరకాల ఎత్తుగడలు అవలంభించారు. పోలిరగ్‌ రోజున పల్నాడు జిల్లా మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల తదితర నియోజవర్గాల్లో ఘర్షణలు భారీగా జరిగినా పోలింగ్‌ మాత్రం ఎక్కడా ఆగలేదు. దాదాపు 8 కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసం చేసినా ప్రత్యామ్నాయ ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించారు. రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికల కమిషన్‌ ఎప్పటికపుడు అధికారులను అప్రమత్తం చేసింది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో టిడిపి, వైసిపి హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్‌ శాతం భారీగా పెరగడం, కొత్త ఓట్లు యువత ఉత్సాహంగా పాల్గొనడం, మహిళలు కూడా భారీగా పోలింగ్‌లో పాల్గొనడంపై ఎవరికి వారు తమదే గెలుపంటున్నారు. నియోజకవర్గాల వారీగా అంచనాలు వేస్తున్నారు. ఇందులో మహిళల పాత్ర కీలకం కానుంది.

➡️