ఘనంగా ఉగాది వేడుకలు

Apr 9,2024 20:57

ప్రజాశక్తి-విజయనగరం కోట : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక మన్నార్‌ రాజ గోపాలస్వామి ఆలయంలో మంగళ వారం సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకలకు జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ మన్నార్‌ రాజగోపాల స్వామిని జెసి దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వారణాశి ధర్మారావు శర్మ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ ఏడాది విద్య, వైద్యం, సాంకేతిక, క్రీడారంగాలు, పర్యాటకం, సంగీతం, సాహిత్యం, కళా రంగాలు అబివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఉగాది సందర్భం గా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, 60 ఏళ్లు దాటిన ప్రముఖ అర్చకులు దొంతుకర్తి సోమేశ్వర శర్మ(శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం, ఎల్‌.కోట), భద్రం అప్పలాచార్యులు (శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, బొబ్బిలి), మురపాక వెంకట శేషుబాబు (రామలింగేశ్వర స్వామి ఆలయం, జి.అగ్రహారం) లను ఘనంగా సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి రూ,10,116 నగదు పురస్కారం, ప్రశంసా పత్రంతోపాటు దుశ్శాలువతో సత్కరించారు. వివిధ సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహించారు. నాదస్వరం, అన్నమాచార్య కీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ టి.అన్నపూర్ణ, సిపిఒ పి.బాలాజీ, పశు సంవర్ధకశాఖ జెడి డాక్టర్‌ విశ్వేశ్వర్రావు, వ్యవసాయశాఖ జెడి తారకరామారావు, మెప్మా పీడీ సుధాకరరావు, మున్సిపల్‌ సహాయ కమిషనర్‌ తిరుమలరావు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌, తాహశీల్దార్‌ పివి రత్నం, రాజగోపాలస్వామి ఆలయ ఇఒ వంశీలక్ష్మి, వివిధ ఆలయాల ఇఒలు, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️