మంగళగిరిలో అంగన్వాడీల ర్యాలీ

Jan 19,2024 14:35 #Guntur District
anganwadi workers strike 39th day mangalagiri

ఐసిడిఎస్ కార్యాలయం వద్ద షోకాజ్ నోటీసులకు అంగన్వాడీల వివరణ
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 39 రోజుకు చేరింది. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయ రమాదేవి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడినుండి ఐసిడిఎస్ మంగళగిరి ప్రాజెక్ట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన తెలియజేసి సోకాజ్ నోటీసులకు వివరణ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం యస్మాను దుర్వినియోగం చేయడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికల సాధన కొరకు మూడు రోజుల నుండి విజయవాడలో నిరవధిక దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు . అంబేద్కర్ దళితుల, మహిళలు ఆత్మాభిమానంతో జీవనం సాగించాలని రాజ్యాంగంలో రాయడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. సమ్మె చేసే హక్కు రాజ్యాంగం లో ఉందని అన్నారు. అందుకు విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణం ముఖ్యమంత్రి స్పందించి అంగన్వాడీల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ గౌరవాధ్యక్షులు వేముల దుర్గారావు మాట్లాడుతూ నిత్యవసర ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని అన్నారు. అందుకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల ఆగ్రహానికి గురి అయితే ప్రభుత్వాలే మారిపోతాయని హెచ్చరించారు. సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకి ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల సిఐటియు నాయకులు వై కమలాకర్, డి వెంకటరెడ్డి, బి వెంకటేశ్వర్లు, కరుణాకర్ రావు, జె బాలరాజు, అంగన్వాడి యూనియన్ నాయకులు హేమలత, రుక్మిణి, తబిత, ఫాతిమా, జయ, సరస్వతి, రైతు సంఘం నాయకులు ఎం పకీరియా, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం బాలాజీ, కే ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏసీ డిపోకు షోకాస్ నోటీసులకు వివరణ సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు.

➡️