భారీగా మద్యం స్వాధీనం

May 10,2024 00:50

సత్తెనపల్లి మండలంలో పట్టుబడ్డ మద్యం, నిందితులతో పోలీసులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు గురువారం భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి పట్టణ పోలీసులు, సెబ్‌ అధికారులు తనిఖీలు చేపట్టగా 1812 మద్యం బాటిల్స్‌ను పట్టుబడ్డాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యాన్ని తీసుకెళుతున్నారనే సమాచారం మేరకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు బుధవారం రాత్రి వాహనాలను తనిఖీ చేయగా ఆటోలో 1515 క్వార్టర్‌ మద్యం బాటిల్స్‌ను గుర్తించి సీజ్‌ చేశారు. పట్టణంలోని విక్టరీ బార్‌ నుండి ద్విచక్ర వాహనాలపై మద్యం బాటిల్స్‌ తీసుకెళుతున్న ఇద్దర్ని సత్తెనపల్లి సెబ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు గోతాల్లో వున్న 297 మద్యం బాటిల్స్‌ను, రెండు ద్విచక్ర వాహనాలను సెబ్‌ సిఐ హెచ్‌.శ్రీనివాసులు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని నాగన్నకుంట ప్రాంతానికి చెందిన మారెళ్ల మహేష్‌, కాకుమాను హృదయ రాజును అరెస్టు చేశారు. సత్తెనపల్లి మహేశ్వరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నుండి ధూళిపాళ్ల మద్యం లోడుతో వెళుతున్న ఆటోను పట్టణ పోలీసులు ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో పట్టుకున్నారు. ఆటోలోని 1515 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధూళిపాళ్ల భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ జి.లాజర్‌ను అరెస్టు చేశారు. పట్టణ ఎస్‌ఐ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రాజుపాలెం మండలం కోటనేమాలిపురి బస్‌స్టాండ్‌ సెంటర్లో అధికారపార్టీ జెడ్‌పిటిసి డి.సునీతరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డికి చెందిన మిల్లులో నిల్వ ఉంచిన 369 మద్యం సీసాలను ఎస్‌ఐ సమీర్‌బాషా, ఎసిసి బృదం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

➡️