గొడవలు పెట్టుకుంటే నేరుగా జైలుకే : పల్నాడు ఎస్పీ

May 10,2024 00:48

మాట్లాడుతున్న ఎస్పీ బిందుమాధవ్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పోలింగ్‌ కేంద్రాల వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ హెచ్చరించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పోలీస్‌ కార్యాలయ ఆవరణలో నర్సరావుపేట రూరల్‌, రొంపిచర్ల పోలీస్‌స్టేషన్ల పోలీస్‌ అధికారులు, సమస్యాత్మక గ్రామాలకు చెందిన వారితో గురువారం మాట్లాడారు. వివాదాలకు పోవద్దని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు గ్రామాల్లోని అనుమానితులను ఇప్పటికే బైండోవర్‌ చేశామని, ఎవరైనా గొడవలు, అల్లర్లు, కొట్లాటల్లో పాల్గొంటే నేరుగా జైలుకు పంపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నరసరావుపేట రూరల్‌ సిఐ మల్లికార్జునరావు, రూరల్‌ ఎస్సై రోశయ్య, రొంపిచర్ల ఎస్సై పాల్‌రవీంద్ర పాల్గొన్నారు.

➡️