ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

Apr 18,2024 21:14

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : కురుపాం నియోజకవర్గానికి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం తరపున పోటీ చేస్తున్న మండంగి రమణను అభ్యర్థి మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ కోరారు. మండలంలోని రావాడరామభద్రపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి రైతులను, కూలీలను, గిరిజనులను, దళితులను, నిరుద్యోగులను మోసగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్‌, పెట్టుబడుదారులకు అప్పజెప్పడానికి చూస్తుందని, గిరిజన చట్టాలను కాలరాస్తుందని, గిరిజన హక్కులను పూర్తిగా రాజ్యాంగంలో మార్చివేస్తుందని అన్నారు. జీవో 3 తీసేసి గిరిజనులకు అన్యాయం చేసిందని, 1/70 చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో ఉన్న కొండలను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్‌ పెట్టుబడులకు అప్పజెప్పడానికి చూస్తుందని తెలిపారు. అలాగే రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసి గిరిజనులకు, దళితులకు బిసిలకు అన్యాయం చేయడానికి సిద్ధపడిందని ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి విభజన హామీలను నేటికీ అమలు చేయలేదన్నారు. అటువంటి బిజెపితో ఐదేళ్ల పాటు వైసిపి కుమ్మక్కై ప్రభుత్వాన్ని నడిపించిందని, ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుని బిజెపి ప్రమాదాన్ని ఆంధ్ర రాష్ట్రానికి చూపిస్తున్నాయని, కావున ఈ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే ఈనెల 23న సిపిఎం అభ్యర్థి మండంగి రమణ నామినేషన్‌ కురుపాంలో వేయనున్నారని, దీనికి అధిక సంఖ్య ప్రజలు హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన, టిడిపి, బిజెపి కూటమిని, వైసిపిని ఓడించాలని, ప్రజల తరఫున పోరాడే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థి గెలిపించాలని కోరారు. బిజెపి, వైసిపి హయాంలో అన్నిరకాల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో సామాన్యుడు బతక లేని పరిస్థితులున్నాయని అన్నారు. విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగనాయుడు, మండల కార్యదర్శి కోరంగి సీతారాం, సిపిఎం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ, సిపిఐ నాయకులు ప్రసాదరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. గరుగుబిల్లి : రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గరుగుబిల్లి, పెద్దూరు, రావుపల్లి కొత్తపల్లి గ్రామాల్లో సిపిఎం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, కరణం రవీంద్ర మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్నాయని బిజెపి, దాని మిత్రపక్షాలను, బిజెపికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న వైసిపిని ఒడించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై, రాజ్యంగ స్ఫూర్తిని కాపాడేందుకు కృషి చేస్తున్న సిపిఎం అభ్యర్థులను కురుపాం నియోజకవర్గానికి పోటీ చేస్తున్న మండంగి రమణను అలాగే అరకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పి.అప్పలనర్సను గెలిపించాలని, కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేష్‌, ప్రకాష్‌,సూర్యనారాయణ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రజాసేవకు నిదర్శనం అప్పలనరసపాచిపెంట: ప్రజా సేవకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఇండియా వేదిక బలపరిచిన అరుకు ఎమ్‌పి అభ్యర్థి పాచిపెంట అప్పలనరస అని అటువంటి వ్యక్తిని గెలిపించుకో వాలని సిపిఎం నాయకులు కోరారు. ఆయన్ను గెలిపించాలని కోరుతూ గురువారం మండలంలోని మెట్టవలస, కుడుమూరు, కొత్తవలస, శీల గ్రామాలలో సిపిఎం నాయకులు సూకూరు అప్పలస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మే 13న జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థి అప్పలనరసను గెలిపించాలని కోరారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే అప్పలనరస నిత్యం ప్రజల కోసం అండగా ఉంటారని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, నిరంతరం ప్రజలకు అండగా ఉన్న ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తమ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి పాచిపెంట అప్పలనరసని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️