కొత్త సీసాలో పాత మందులా భారతీయ న్యాయ సంహిత

Jun 17,2024 00:39

జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను సత్కరిస్తున్న ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ :
కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారతీయ న్యాయ సంహిత ఐపిసి పీనల్‌ కోడ్‌ను పోలి ఉందని, కొత్త సీసాలో పాత మందు పోసిన సామెతను పోలి ఉందన్నారు. సైబర్‌ క్రైమ్‌ లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు వంటి పలు రకాల సెక్షన్ల గురించి ఆయన వివరించారు. ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు నేర్పు కలిగి ఉండాలన్నారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్‌ చట్టం, మేధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, చలించని ఆస్తులు-డాక్యుమెంటేషన్‌ మొదలైన పలు రకాల అంశాల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకానాథరెడ్డి, కెఎల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సులర్‌ డాక్టర్‌ జి.పార్థసారథి వర్మ, ప్రొ వైస్‌ చాన్స్‌లర్లు డాక్టర్‌ ఎవిఎస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌.వెంకట్‌రామ్‌, డాక్టర్‌ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్‌ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️