తనిఖీలు ముమ్మరం చెయ్యాలి : జె.సి తేజ్ భరత్

ప్రజాశక్తి-కడియం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలని జెసి తేజ్ భరత్ అన్నారు. కోనసీమ జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చే పొట్టిలంక వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ నందు రికార్డులను కడియం సిఐ బి తులసీదర్, తహసీల్దార్ బి. రమాదేవితో కలిసి మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమహేంద్రవరం రూరల్ ఆర్వో తేజ్ భరత్ పరిశీలించారు . చెక్ పోస్ట్ వద్ద షిఫ్ట్ ల వారీగా విధులను నిర్వర్తించే వారు విధిగా హజరు రిజిస్టర్ లో సంతకాలు చెయ్యాలని ఆదేశించారు. ప్రతీ రోజు నిర్దేశించిన లక్ష్యాల మేరకు తనిఖీలు నిర్వహించాలని, అనుమానం కలిగిన వారిపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. వాటి వివరాలు ఎప్పటి కప్పుడు నమోదు చేయ్యలన్నారు. చెక్ పోస్ట్ ల సిసీ కెమెరాల పనితీరు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మీదుగా జాతీయ రహదారులు ప్రధాన మార్గాలు వెళుతూ ఉన్నాయానీ, ఆమేరకు వాహనాలు, రవాణా వ్యవస్థ పై, వ్యక్తుల కదలికల పై నిఘాను మరింత ఎక్కువగా చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించే వివిధ నోడల్ అధికారుల పర్యవేక్షణ పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు, వస్తువులు, మద్యం తదితరాలు తరలించే అవకాశం ఉందని తెలిపారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సమయ పాలన ఖచ్చితంగా పాటించాలనీ పేర్కొన్నారు. నిఘా నిర్వహించడంలో నిబద్దత కలిగి ఉండడం, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘన చేసే వారిపై కేసులు నమోదు చేయలని తెలియ చేశారు. జెసి వెంట డిటి సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

➡️