జెండాలు మార్చే వ్యక్తిని కాదు.. మోసే వ్యక్తినే..

ప్రజాశక్తి-శింగరాయకొండ : తాను జెండాలు మార్చే వ్యక్తిని కాదని..జెండాలు మోసే వ్యక్తినేనని ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు. వైసిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. అందులో భాగంగా పాకల రోడ్డు వద్ద నుంచి కందుకూరు రోడ్డు వరకూ రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం కందుకూరు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడారు. తాను జెండాలు మోసే వ్యక్తేనని, ఐదేళ్లకు ఒకసారి జెండా మార్చే వ్యక్తిని కాదన్నారు. ప్రజలు జండాలు మార్చే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. జండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. కొండపిలో గత పది సంవత్సరాలుగా వైసిపి ఓటమికి నాయకులే కారణమని, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా జెండా ఎగరేసేందుకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు పుట్టిన చంద్రగిరి నియోజకవర్గం నుంచి తాను గతంలో గెలిచినట్లు తెలిపారు.కొండపి నియోజక వర్గ మేనిఫెస్టో విడుదలకొండపి నియోజకవర్గ మేనిఫెస్టోను వైసిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి , రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. మర్రిపూడి, పొన్నలూరు మండలాలకు ప్రయోజనం చేకూర్చేందుకు సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కొండేపి నియోజకవర్గంలోని ఎస్‌సి కాలనీలో శ్మశాన వాటికలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శింగరాయకొండ, మరిపూడి మండలాల్లో అసైన్మెంట్‌ భూములను క్రమబద్ధీకరణకు కషిచేస్తానని తెలిపారు. శింగరాయకొండ బైరాగి మాన్యంలోని స్థలాలు రిజిస్ట్రేషన్‌ అయ్యే విధంగా చేస్తామన్నారు. జలజీవని మిషన్‌ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. పొగాకు, సుబాబులు రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తామన్నారు. శింగరాయకొండ గ్రామ పంచాయతీలో హిందువుల శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామన్నారు. కాళహస్తి రైల్వే లైన్‌ పూర్తి చేసేందుకు కషి చేస్తామన్నారు. పాలేరు మరియు మన్నేరు నదుల్లో చెక్‌ డాములు నిర్మాణం చేపడతామన్నారు. తీర ప్రాంతంలో సురక్షితంగా ఉంచేందుకు స్పీడ్‌ బోట్లను అందజేస్తామని తెలిపారు. పార్కుల నిర్మాణం చేపడతామని తెలిపారు. శింగరాయకొండను మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. శింగరాయకొండలో మెయిన్‌ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తేకొండపికి అభివద్ధిని పరిచయం చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో సామంతుల రవికుమార్‌ రెడ్డి, యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, డాక్టర్‌ యన్నా బత్తిన కార్తీక్‌, యనమల మాధవి, తన్నీరు ధర్మరాజు, షేక్‌ సలీం బాషా, చుక్కా కిరణ్‌ కుమార్‌, షేక్‌ కరీం, రాపూరి ప్రభావతి పాల్గొన్నారు.

➡️