ఓటు వేయటం ఉద్యోగి బాధ్యత

May 6,2024 00:40

ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి చైతన్య వంతమైన సమాజ నిర్మాణం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి 11వ తేదీ వరకూ ఫెసిలిటెషన్‌ సెంటర్‌లను కొనసాగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా చైర్మన్‌ చాంద్‌బాషా అధ్యక్షతన చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారా యణ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న రూ.25వేల కోట్లు చెల్లింపు, ఆర్టిసి విలీన సమస్యల పరిష్కారం, కాంట్రాక్ట్‌, కంటింజెంట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లింపు, సకాలంలో పిఆర్‌సి అమలు, డిఏల అమలు, సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేయటం పెన్షనర్లకు ఎడిషన్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ చెల్లింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌లు ప్రొఫెషనల్‌ డిక్లరేషన్‌ ఆలస్యం అయినందున ఆ సమయంలో రావాల్సిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఉద్యోగికి రూ.3 నుండి రూ.5 లక్షల వరకూ బకాయిలు ఉన్నాయన్నారు. వీటిపై ఎవ్వరూ స్పష్టమైన హామీ ఇవ్వట్లేదన్నారు. 30 ఏళ్లుసర్వీసుకు తన పదవీ విరమణ సమయంలో హాయిగా జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని, వాటిలో మొదటిది పెన్షన్‌ చెల్లింపు ఉద్యోగ హక్కుగా ఉందని, కానీ సిపిఎస్‌ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన అనంతరం ఆసరా పెన్షన్‌ కంటే తక్కువగా రూ.2వేలు, రూ.3వేలు పెన్షన్‌ తీసుకోవటం ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఉద్యోగులు రోజువారీ సమస్యల పరిష్కారానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, ఈ సమస్యల పరిష్కారానికి చట్టబద్ధ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అన్నారు.ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని, సకాలంలో పీ ఆర్‌ సి అమలు చేయాలని కరువు భత్యం సకాలంలో చెల్లించాలి అని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో చైర్మన్‌ కరణం హరికష్ణ, సెక్రటరీ జనరల్‌ బాజీ పఠాన్‌, ఉపాధ్యక్షులు కేదారేశ్వరరావు, పాపారావు, రమేష్‌బాబు, రవీంద్ర బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు అబ్దుల్‌ రజాక్‌, జిల్లా సహా అధ్యక్షులు ఎల్‌.మహేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️