ఉద్యోగ భద్రత కల్పించాలి

Jun 17,2024 21:17

ప్రజాశక్తి – కురుపాంవైన్‌ షాపుల్లో గత ఐదేళ్ల నుంచి సూపర్వైజర్లు, సేల్స్‌ మేనేజర్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వైన్‌ షాప్‌ సిబ్బంది కోరుతున్నారు. మండల కేంద్రమైన కురుపాంలో గల వైన్‌ షాపు వద్ద కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస వైన్‌ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది సోమవారం నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3600 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు, సేల్స్‌మేన్లుగా పనిచేస్తున్నారని, వీరంతా అప్పట్లో జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుకున్న యువకులు విధుల్లో చేరామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికి ఐదేళ్లు పూర్తి అయినది గత ప్రభుత్వం మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కరోనా కాలంలో రాష్ట్ర ఆదాయం కోసం మా ప్రాణాలను తెగించి రాత్రింబళ్లు కష్టపడి పనిచేశామని తెలిపారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వివిధ పత్రికల్లో మద్యం షాపులను ఎత్తివేసి, పాత పద్ధతిలో నడిపిస్తారని ప్రచారం జరుగుతుందని, ఇదే నిజమైతే కుటుంబాలతో తామంతా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. కావున స్పందించి మద్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్‌ మేన్లను ఇతర ప్రభుత్వం విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగం కల్పించి, మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సిబ్బంది జి.శంకర్రావు, గ్రంధి శ్రీను, ఎ.చంద్రశేఖర్‌, ఉదరు , బాలు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

➡️