కడపలో తమ్ముళ్ల కుస్

తీరెండుగా చీలిన టిడిపి శ్రేణులు
ఇంటిపోరులో కడప ఇన్‌ఛార్జి
ఆందోళనలో టిడిపి కేడర్‌
ప్రజాశక్తి – కడప ప్రతినిధి
‘ఇంటిపోరు ఇంతింత కాదయా’ అనే సామెత కడప టిడిపి పరిస్థితిని తలపిస్తోంది. అసెంబ్లీ టికెట్‌ రేసులో ఆర్‌.మాధవి, మైనార్టీ నాయకులు అమీర్‌బాబు, అలంఖాన్‌పల్లి లకీëరెడ్డి హోరా హోరీగా పోటీ పడిన సంగతి తెలిసిందే. ఇటీవల టిడిపి అధిష్టానం టికెట్‌ను మాధవికి ఖారారు చేసింది. కడప ఇన్‌ఛార్జి అసంతృప్తులను బుజ్జగింపులతో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు భిన్నంగా ఎదురు తన్నుతోంది. ఎక్కడ పొరబాటు దొర్లిందో గుర్తించి చికిత్స చేసుకోవాలి. ఒకవైపు అధికార వైసిపి అభ్యర్థి సమన్వయంతో దూసుకెళ్తుండగా, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థి గ్రూపులు, వేర్వేరుగా ప్రచారాలు, ప్రత్యేక శిబిరాల నిర్వహణతో రోజురోజుకూ బలహీన పడుతుండడం కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.కడప టిడిపిలో అంతర్గత కుమ్ములాట పతాకస్థాయికి చేరుకుంది. రెండు నెలల కిందట టికెట్‌ కోసం పోటీ పడిన మాధవి, అమీర్‌బాబు, అలంఖాన్‌పల్లి లకీëరెడ్డి మధ్య మనస్పర్థలు తొలగడం లేదు. ఎవరికి వారుగా ప్రచారాలు, ఎత్తుగడల్లో నిమగం కావడం గమనార్హం. టిడిపి టికెట్‌ దక్కించుకున్న కడప ఇన్‌ఛార్జి మాధవి చేసిన ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రెండు నెలలుగా సాగించిన అగ్రెసివ్‌ పాలిటిక్స్‌ సొంత ఇంట్లో ఏర్పడిన కుంపటి కారణంగా నీరసించిపోతోంది. టికెట్‌ రేసు ముగిసిన అనంతరం బుజ్జగింపులు, నచ్చజెప్పడం వంటి సానుకూల ధోరణితో టిడిపి నాయకత్వాన్ని, ద్వితీయశ్రేణి కేడర్‌ను, శ్రేణులను ఏకం చేయాలి. రెండు నెలల కిందట తరహాకు ఏ మాత్రమూ తీసిపోని పరిస్థితిని తలపిస్తోంది. ఇటీవలి వరకు అసంతృప్త నేతలు వేర్వేరుగా ప్రచారాలు నిర్వహించారు. సీనియర్‌ నాయకులు అలంఖాన్‌పల్లి లకీëరెడ్డి అపార రాజకీయ అనుభవాన్ని, కడప అసెంబ్లీ ఓటర్ల జాబితాలోని 2,74,226 ఓట్లలో మూడింట ఒక వంతు కలిగిన మైనార్టీ ఓట్లను ఆకర్షించడానికి ఉపయోగపడే అమీర్‌బాబుని నిర్లక్ష్యం చేయడం టిడిపికి మైనస్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ నేత కన్వెన్షన్‌ హాలులో అసంతృప్త నేతలు ఆత్మీయ సమావేశాల పేరుతో కలుసుకోవడం అసమ్మతి తీవ్రతకు అద్దం పడుతోంది. టిడిపి అభ్యర్థి ఇంటి పోరును అధిగమించడం సవాలుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ నెల 10న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కడప నగరంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అప్పటి సమావేశంలో టిడిపి అసంతృప్త నేతలను బుజ్జగించి గాడిలో పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్‌ అసంతృప్త నేతలను బుజ్జగించి, వారి రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ ఇస్తే తప్పా సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

➡️