గడువులోపు అర్టీలను పూర్తి చేయాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప ఓటర్ల జాబితాకు సంబంధించి ఫారం-6,7,8 అర్జీల పెండెన్సీలను నిర్ధేశిత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని బోర్డ్‌ రూమ్‌ హాలులో ప్రయారిటీ బిల్డింగ్స్‌, కాస్ట్‌ సర్వే, ఆరోగ్య సురక్ష సర్వే,పెండింగ్‌ ఫారాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, పంచాయితీ కార్యదర్శులు, వాలంటీర్లు, అటెండెన్స్‌, ఎపి సర్వీసెస్‌, హౌసింగ్‌, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్నకు చెబుదాం, వివిధ సంక్షేమ పథకాలపై జెసి గణేష్‌ కుమార్‌, నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూషలతో కలిసి మండల అధికారులతో విసి ద్వారా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎలాంటి అలసత్వం వహించకుండా ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయారిటీ బిల్డింగ్స్‌ సంబంధించి స్టేజ్‌ కన్వర్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి అన్‌ ప్రాసెసెడ్‌ అర్జీలను పెండింగ్‌ లేకుండా ఏ రోజుకు పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్య సురక్ష సర్వేలో ఎలాంటి పెండింగ్‌ లేకుండా పంచాయితీ, సచివాలయాల్లో త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. మిగిలిఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌ను సచివాలయ సిబ్బంది త్వరగా పూర్తి చేయాలన్నారు. సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ వాలంటీర్ల అటెండెన్స్‌పై ఆరా తీశారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయాల్లో బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ అర్జీలకు పరిష్కార మార్గం చూపి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎలాంటి పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు ఆర్‌డిఒలు మధుసూధన్‌, శ్రీనివాసులు, ఇఆర్‌ఒ కొసర్‌ బాను, హౌసింగ్‌ పీడీి కష్ణయ్య, డిఎస్‌పి షరీఫ్‌, డ్వామా పీడీ యధుభూషణ్‌ రెడ్డి, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆనంద్‌ నాయక్‌, సిపిఒ వెంకటరావు, పిఆర్‌ ఎస్‌ఇ శ్రీనివాసులురెడ్డి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.( ఫోటో:- మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరు రామరాజు)

➡️