చేనేత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వృత్తి సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య అన్నారు. శుక్రవారం ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పాల సుబ్బారావు కుటుంబాన్ని పరామ ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కొక్కరికి రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. 3.10 ఎకరాల భూమి వారి కుటుంబానికి చెందేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుబ్బారావు పెద్ద కుమార్తె పాల లక్ష్మీప్రసన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వృత్తినే అగాధంలోకి తోసేశారన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్‌లు రద్దు చేయడం గాని, నూలుపైన 19 శాతం, పట్టుపైన ఐదు శాతం జిఎస్‌ టి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన వస్త్రాలకు మార్కె ట్‌ సౌకర్యం కల్పించకపోగా సంక్షేమంలో భాగమైన చేనేత కార్మికులకు ఇచ్చే రాయితీలు కూడా కోత పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అంశాలే చేనేత కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఉందని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ మాట్లా డుతూ చేనేతకు గతంలో చట్టం చేసిన 11 రకాల బట్టలకు పవర్‌లూమ్‌ నుంచి మినహాయించి హ్యాం డూమ్‌కే హక్కుగా ఉంచాలని జగనన్న నేతన్న నేస్తం చేనేత కుటుంబాల అందరికీ షరతులు లేకుం డా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులకు వర్క్‌ ఫ్రం షెడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులో అభివృద్ధిపరిచి ఉపయోగంలోకి తీసుకు రావాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి కలెక్టర్‌ అధ్యక్షతన న్యాయ విచారణ జరిపి ఆత్మహత్యకు ముందు సుబ్బారావు రాసిన లేఖని మరణ వాం గ్మూలంగా స్వీకరించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.నర్సయ్య, సహాయ కార్యదర్శి సురేష్‌బాబు, సాంబయ్య పాల్గొన్నారు.

➡️