నామినేటెడ్‌ ఆశలు

రాష్ట్ర కేంద్రం నుంచి అర్హులకు ఫోన్లుబయోడేటా, ఇన్‌ఛార్జి లెటర్లు అందజేతకు ఆదేశాలు
ఇన్‌ఛార్జిల దగ్గర ద్వితీయశ్రేణి నాయకుల విజ్ఞప్తులు
గ్రూపుల వారీగా జాబితాలు తయారీలో నిమగం
ప్రజాశక్తి – కడప ప్రతినిధి
జిల్లాలో నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు ఊపందుకున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర టిడిపి కార్యాలయం నుంచి కొంతమంది అర్హులైన నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి అర్హత సంబంధిత సమాచారాన్ని కోరుతోంది. ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. ఆశావహుల బయోడేటాతోపాటు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి లెటర్లు అందజేయాలని కోరుతుండడం ఆశలు రేపుతోంది. పార్టీకి అందించిన సేవలు, పార్టీ అప్పగించిన బాధ్యతల నిర్వహణ, ఇతర కార్యకలాపాల వివరాలను అందజేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నాయకులు, సీనియర్‌ కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల దగ్గరికి పరగులు తీస్తున్నారు. ఈ సారైనా తమకు నామినేటెడ్‌ పదవులు లభించే విధంగా సిఫారసు చేయాలని పార్టీ నియోజకవర్గ, జిల్లా నాయకత్వాలను కోరుతున్నారు. కడప, అన్నమయ్య జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. పులివెందుల, బద్వేల్‌, రాజంపేట, తంబళ్లపల్లి మినహా మిగిలిన తొమ్మిదింట్లో ఏడు టిడిపి, ఒకటి చొప్పున జనసేన, బిజెపి గెలుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పాత, కొత్త నేతలు తమ నియోజకవర్గాల్లో పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్‌ పదవులను కేటాయించాలని కోరుతున్నారు. గత ఐదేళ్లలో పార్టీకి చేసిన సేవలు, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల నిర్వహణ, వైసిపి హయాంలో ఇబ్బందులు పడ్డ తీరును ఏకరువు పెడుతున్నారు. ఇటువంటి కేడర్‌ను అర్హులుగా గుర్తించి పదవులు పంపిణీ చేయాలని కోరుతున్నారు. టిడిపిలో బహు నాయకత్వం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయడం ద్వారానే గెలుపు సాధ్యమైంది. ఇందుకు అనుగుణంగా గ్రూపులు వారీగా జాబితాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. వైసిపి హయాంలో నామినేటెడ్‌ పదవుల భర్తీలో జిల్లాకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించింది. రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పోస్టులు మొదలుకుని వివిద శాఖలు, సంస్థల్లో డైరెక్టర్‌ పదవుల వరకు దక్కాయి. టిడిపి నాయకత్వం వైసిపి తరహాలోనే నామినేటెడ్‌ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే నామినేటెడ్‌ పోస్టుల పందేరానికి శ్రీకారం చుట్టింది. 2014-2019 టిడిపి ప్రభుత్వ హయాంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ అనే మాటే మరిచిపోవడంతో కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. 2024-2029 పీరియడ్‌లో గతానికి భిన్నంగా నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేపట్టే దిశగా కదులుతోంది. వైసిపి హయాంలో నామినేటెడ్‌ పదవులు పొందిన పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు, వివిధ శాఖల, సంస్థల డైరెక్టర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. వీరి స్థానాల్లో టిడిపి సీనియర్‌ నాయకులు, సీరియస్‌ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే దిశగా కదులుతుండడం ఆశలు రేపు తోంది.

➡️