జమ్మలమడగులో అంతర్గత పోరు!

అబ్బాయికి బాబారు స్ట్రోక్‌
పొత్తు పేరుతో త్యాగంపై డైలమా?
గెలుపు అవకాశాలు గల్లంతు
టిడిపి కేడర్‌లో అయోమయం
ప్రజాశక్తి – కడప ప్రతినిధిజమ్మలమడుగు టిడిపిలో అంతర్గత సంక్షోభం నెలకొంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నిలవనున్న భూపేష్‌రెడ్డిని ఆదరించాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గత జిల్లా పర్యటన సందర్భంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన ప్రేరణతో భూపేష్‌రెడ్డి తనదైన శైలిలో నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల మద్దతు సంపాదించుకునే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. ఒకవైపు పాదయాత్ర, మరోవైపు టిడిపిలోనికి వైసిపి నాయకులను, కార్యకర్తలను, మద్దతుదారులను, తటస్తులను విశేషంగా ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫలితంగా 15 రోజల కిందట ముద్దనూరులో టిడిపిలోకి చేరికల సందర్భంగానే టిడిపి, వైసిపి కార్యకర్తలు, నాయకుల మధ్య హోరాహోరీ పోరాటం నడిచిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ పరిధిలోని జమ్మలమడుగు, ముద్దనూరు, కొండాపురం, మైలవరం మండలాల మీదుగా సాగిన పాదయాత్ర సందర్భంగా ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపిస్తే గండికోట నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని, ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కృషి చేస్తానని, సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతానని, ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలను మెరుగు పరుస్తాననే హామీలను ఇస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనదైన విజన్‌తో స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్న నేపథ్యంలో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. ఫలితంగా 2019 సార్వత్రి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం.వి.సుధీర్‌రెడ్డి సాధించిన 52 వేలకుపైగా భారీ మెజార్టీని అధిగమించి గెలుపు సాధిస్తామనే భరోసాతో కూడిన వాతావరణం కలిగించడంలో కృతకృత్యులయ్యారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో టిడిపి, బిజెపి, జనసేన పొత్తు ధర్మంలో భాగంగా బిజెపి తరుపున ఆయన బాబారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు జోరందుకోవడం కేడర్‌లో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. టిడిపి అధిష్టానం సైతం బిజెపితో పొత్తు కోసం అర్రులు చాస్తున్న నేపథ్యంలో కేడర్‌లో డైలమా వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో సాగుతున్న వ్యూహాత్మక రాజకీయానికి బ్రేకులు వేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు పంచాయతీలు, రెండు ఎంపిటిసిలను బిజెపి దక్కించుకుంది. ఇటువంటి అసెంబ్లీ స్థానంలో బిజెపి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబారు బరిలో నిలువనున్నట్లు సమాచారం. టిడిపి ఓటర్లు బిజెపి ఎన్నికల గుర్తు కమలం వైపు మళ్లించడం సాధ్యమయ్యే పనికాదనే వాదన వినిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 52 వేల ఓట్లకుపైగా భారీ మెజార్టీతో టిడిపి అభ్యర్థుల ఓటమి పాలైన నేపథ్యంలో మరోసారి పోటీ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనమూ ఉండదనే వాదన వినిపిస్తోంది. పొత్తు ధర్మంలో భాగంగా జిల్లాలో టిడిపి గెలిచే అవకాశం కలిగిన జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేయనుండడం పట్ల కేడర్‌లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలైన జమ్మలమడుగులో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిరాకరించడం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులిచ్చి వెనక్కు తీసుకోవడం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిరాకరించడం, రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ జిల్లాకు, రాయలసీమ, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి అసెంబ్లీ టికెట్‌ త్యాగం చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.

➡️