‘పుచ్చలపల్లి’ని ఆదర్శంగా తీసుకోవాలి

ప్రజాశక్తి – బద్వేలు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలను అన్ని శాఖలలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రజాసంఘాల కన్వీనర్‌ కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడుగ, స్వతంత్ర సమరయోధుడుగా, కమ్యూనిస్టు గాంధీగా పేరొందారని చెప్పారు. సుందరయ్య తెలుగు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖులన్నారు. కుల వ్యవస్థను నిరసించారన్నారు. పుచ్చలపల్లి సుందర్‌ రామిరెడ్డిలోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారని చెప్పారు. సహచరులు ఆయన్ను కామ్రేడ్‌ పిఎస్‌ అనే ముద్దుగా పిలిచేవారని తెలిపారు. ఇతను నిరాడంబరతో ఆదర్శ జీవితం గడిపారన్నారు. పార్లమెంట్‌ సభ్యునిగా సుదీర్ఘకాలం పని చేశారన్నారు. ఆ సమయంలో పార్లమెంట్‌ కూడా సైకిల్‌ పై వెళ్లేవారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సుందరయ్యను ఆదర్శంగా తీసుకొని పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మహిళా నాయకులు మోక్షమ్మ, రాములమ్మ, కైరున్‌ బి, మస్తాన్‌ బి, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ నాగమ్మ, రత్నమ్మ, డివైఎఫ్‌ఐ నాయకులు గంగనపల్లి నాగార్జున, ఉప్పులూరు ఆంజనేయులు, పి సురేంద్ర, మల్లికార్జున, సిఐటియు నాయకులు కొండయ్య, రాజగోపాల్‌, వత్తిదారుల నాయకులు సుబ్బరాయుడు పాల్గొన్నారు.

➡️