అభివృద్ధి కమిటీల జాడేదీ..?

Mar 9,2024 23:23
పిఠాపురం మండలం మల్లం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

పిఠాపురం మండలం మల్లం పిహెచ్‌సి పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. సుమారు 33 వేల మంది జనాభా ఉండగా రోజుకి సరాసరి 120 ఓపి నమోదు అవుతుంది. ఇక్కడ సరిపడా భవనాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అటు ఉద్యోగులకు, ఇటు రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి 42 రకాల వివిధ రక్త పరీక్షలు చేస్తున్నామని వైద్య అధికారులు చెబుతున్నప్పటికీ నామమాత్రపు పరీక్షలతో సరిపెడుతున్నారని రోగులు వాపోతున్నారు. ఎంపిపి చైర్మన్‌గా ప్రతినెలా జరుగుతున్న ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం తూతూమంత్రంగానే ముగుయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అసలు సమావేశాలే జరపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వైద్యులు, సిబ్బంది, మందుల కొరతతో ఇబ్బందులు, వెంటాడుతున్న అసౌకర్యాలు నడుమ జిల్లాలో పలు పిహెచ్‌సిలలో రోగులను సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు సక్రమంగా అందే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో ఆస్పత్రుల అభివృద్ధి సొసైటీ కమిటీ ( హెచ్‌డిఎస్‌సి) కమిటీల పాత్ర కీలకంగా ఉండేది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఈ కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగులుతున్నాయి. దీంతో పిహెచ్‌సిల అభివృద్ధి కుంటుపడే పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం పలు రోగాలు ప్రజలను పట్టి పీడిస్తున్న వేళ సమస్యలను పట్టించుకునే నాధులు కరువయ్యారు.మొక్కుబడిగా సమావేశాలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 126 పిహెచ్‌సిలు ఉన్నాయి. పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందాలని, ఆసుపత్రుల్లో సమర్థవంతమైన పనితీరు కనబర్చాలన లక్ష్యంతో ఆసుపత్రుల అభివృద్ధి సొసైటీ కమిటీలను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించడం, వసతులు, తగిన మందులు ఉండేలా చూడటం, నిధులను అవసరం మేరకు ఖర్చుచేయడం వంటివి ఈ కమిటీలు చూడాల్సి ఉంది. పిహెచ్‌సి కమిటీలో ఛైర్మన్‌గా ఎంపిపి, కన్వీనర్‌గా వైద్యాధికారి, సభ్యులుగా ఎంపిడిఒ, తహశీల్దార్‌, గ్రామ సర్పంచితోపాటు ఎంపిపి నామినేట్‌ చేసిన మహిళా సర్పంచి ఒకరు ఉంటారు. కొన్ని పిహెచ్‌సిల పరిధిలో కమిటీల సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతున్న చాలాచోట్ల రెండు మూడు నెలలకు కూడా జరపడం లేదు. జరుగుతున్న చోట్ల కూడా మొక్కుబడిగా సమావేశాలను అధికారులు పూర్తి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా కేంద్రాల అభివృద్ధి వైపు చర్చ జరగడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.మెరుగైన వైద్య సేవలు మృగ్యంసీజనల్‌ వ్యాధులు, దోమల దండయాత్రతో డెంగీ, మలేరియా, టైపాయిడ్‌ ఇతర రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సక్రమమైన వైద్య సేవలు అందాల్సి ఉంది. అయితే కొన్ని పిహెచ్‌సిల్లో మాత్రమే సరైన సేవలు అందుతున్నా ఎక్కువ కేంద్రాల్లో రోగులకు సంతృప్తికరమైన వైద్యం అండడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే మందులు, సర్జికల్‌ పరికరాల కొనుగోలుకు భారీగా బడ్జెట్‌ తగ్గించింది. దీంతో పలు ఆరోగ్య కేంద్రాల్లో కనీసం సిలైన్‌ పెట్టేందుకు సైతం సంబంధిత క్యాన్లీలా, సూది కూడా అందుబాటులో లేవని రోగులు ఆవేదన చెందుతున్నారు. షుగరు, టైఫాయిడ్‌, హెచ్‌బి వంటి కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నారు. వాటి ఫలితాలు కూడా త్వరితగతిన చాలాచోట్ల ఇవ్వడం లేదు. దీంతో రోగులు సంఖ్య ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గణనీయంగా తగ్గుతూ వస్తుంది.వేధిస్తున్న సౌకర్యాల కొరత పలు కేంద్రాల్లో పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండడం లేదు. పారిశుధ్యం పడకేసింది. పూర్తి స్థాయిలో సిబ్బంది కరువయ్యారు. ఉన్న సిబ్బంది పనితీరు మెరుపడడం లేదు. సరిపడా వైద్యులు పోస్టుల భర్తీ లేదు. నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటున్నారు. అనేక భవనాలు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాధుడు లేరు. తాగునీటి వసతి, రోగులు ఉండే చోట ఫ్యాన్లు, లైట్లు లేకపోవడం నిరంతర విద్యుత్తు సరఫరా ఇలా అనేక సమస్యలతో రోగులు సతమతం అవుతున్నారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి పలు పిహెచ్‌సిలలో ప్రాథమిక వైద్యసేవలే అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ట్రామాకేర్‌ సేవలు అందడం లేదు. ఆర్థోపెడిక్‌, మత్తు డాక్టర్లు లేక రోగులు ఆపరేషన్ల కోసం జిల్లా కేంద్రం కాకినాడ జిజిహెచ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఎక్సరే సౌకర్యాలు ఉండడం లేదు. డబ్బులు వెచ్చించి ప్రయివేటుగా తీయించాల్సి వస్తోంది. ఇలా పలు సమస్యలు ఆరోగ్య కేంద్రాలను వెంటాడుతున్నాయి.

➡️