ఒఎన్‌జిసి పైప్‌లైన్‌ పనుల అడ్డగింత

Mar 1,2024 22:49
ఒఎన్‌జిసి పైప్‌లైన్‌ పనుల అడ్డగింత

ప్రజాశక్తి-కాకినాడతాళ్లరేవు, బైరవపాలెం తదితర మత్స్యకార ప్రాంతాల్లో మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం తమకూ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ నగరం, పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోర్టు ఏరియాలో ఒఎన్‌జిసి, రిలయన్స్‌ కంపెనీల పైప్‌లైన్‌ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని మత్స్యకారులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ, పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఒఎన్‌జిసి రిలయన్స్‌ రిగ్గుల కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ విషయంమై 2009 నుంచీ మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాడుతూనే ఉన్నా మత్స్యకారులకు న్యాయం జరగడం లేదన్నారు. సముద్రంలో ఒఎన్‌జిసి, రిలయన్స్‌ రిగ్గులకు సంబంధించి కార్యకలాపాలకు అన్ని సౌకర్యాలను కాకినాడ నగరం నుంచి పొందుతున్నారన్నారు. అయినప్పటికీ ఒఎన్‌జిసి రిలయన్స్‌ యాజమాన్యాలు మత్స్యకారులకు న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. రెండు మూడు రోజుల్లో మరలా ఒకసారి ఒఎన్‌జిసి, రిలయన్స్‌ అధికారులను ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. నష్టపరిహారం చెల్లించే వరకూ పనులను ముందుకు సాగనివ్వమని ఎంఎల్‌ఎ ద్వారంపూడి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు.

➡️