గ్రూప్‌-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Mar 15,2024 23:05
గ్రూప్‌-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి-కాకినాడఈ నెల 17న జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ సమగ్రంగా చేపట్టాలని డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌ లైజన్‌ అధికారులు, చీఫ్‌ సూపరిం టెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వారితో డిఆర్‌ఒ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 6,843 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం సూరంపాలెంలోని ఆదిత్య విద్యా సంస్థలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామనానరు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ, సమన్వయం కోసం 11 మంది జిల్లా అధికారులు లైజన్‌ అధికారులుగా వ్యవహరిస్తారని, మరో ముగ్గురు తహశీల్దార్లు సహకరిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు, సదుపాయాలను ఛీఫ్‌ సూపరింటెండ్లు చేపట్టాలని, పరీక్షల నిర్వహణపై ఎపిపిఎస్‌సి జారీ చేసిన సూచనలను ఇన్విజిలేటర్లు అందరికీ ముందుగా అవగాహన కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స పోస్ట్‌ ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఒకు, పరీక్షా సమయంలో అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా అందించాలని ఇపిడిసిఎల్‌ అధికారులను, ఎస్కార్ట్‌, భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌ శాఖకు ఆయన సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు వీలుగా తగిన సంఖ్యలో బస్సు సర్వీసులు నిర్వహించాలని ఆర్‌టిసి అధికారులను కోరారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేశామని, ఛీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప మరేవ్వరూ పరీక్షా కేంద్రంలో సెల్‌ ఫోన్లు గాని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వినియోగించడం నిషేధమని తెలిపారు. అనంతరం ఎపిపిఎస్‌సి అసిస్టెంట్‌ సెకట్రరీ వసంత కుమార్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి ఎన్‌.విజయకుమార్‌, పశుసంవర్థక శాఖ జెడి సూర్యప్రకాశరావు, డ్వామా పీడీ పి.వెంకటలక్ష్మి, జియండిఐసి టి.మురళి, ఆర్‌టిసి ఆర్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️