తాగునీటికి ఈ ఏడాదీ కష్టాలేనా.?

Mar 8,2024 22:07
తాగునీటికి ఈ ఏడాదీ కష్టాలేనా.?

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గోదావరి చెంతనే ఉన్నా జిల్లాలో మెట్ట, డెల్టా ప్రాంతాలు ఏటా వేసవి మాసాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. జల జీవన్‌ మిషన్‌ క్రింద చేపట్టిన పనులు నెలలు తరబడి పెండింగులోనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ఏటా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నా ప్రజల వెతలు మాత్రం తీరడం లేదు. దీనిపై గతనెల 4న జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్‌పి సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఇదే అంశాన్ని లేవనెత్తారు. అధికారులపై ప్రశ్నలు సంధించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపడతామని, బోరు బావుల ముందస్తు ఫ్లష్షింగ్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఎద్దడి ఎదుర్కొంటున్న ఆవాసాలకు రవాణా ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు చెప్పుకొచ్చారు. కానీ క్షేత్ర స్థాయిలో అధికారుల సన్నద్ధత అంతగా కనిపించడం లేదు.జిల్లాలో 21 సిపిడబ్ల్యుఎస్‌, 710 పిడబ్ల్యుఎస్‌, ఎంపిడబ్ల్యుఎస్‌ పథకాలు, 3, 415 చేతి పంపుల ద్వారా 667 ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. వీటిలో 54 ఆవాసాల్లో ప్రతి వేసవిలో తాగునీటి ఎద్దడి ఉంటుందని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే నెలల్లో యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. బోర్లు, చేతిపంపులు, పైపులైన్లకు మరమ్మతులు చేపట్టడానికి కేవలం రూ.14.68 లక్షలతో ప్రతిపాదించారు. ప్రధానంగా కాకినాడ రూరల్‌ తూరంగి, మహాలక్ష్మి నగర్‌, వాకలపూడి, తాళ్ళరేవు మండలం తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ద్వారా సరఫరా చేస్తారు. 50 బోర్లు మరమ్మతుల కోసం రూ.6.18 లక్షలు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపడానికి, ఇతర రిపేర్లుకు రూ.8.50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి అనేక ప్రాంతాల్లో నేటికీ తాగునీటి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు 35 వేల జనాభా ఉన్న తూరంగి పంచాయతీ పరిధిలో 8 అవాసాలున్నాయి. వీటిల్లో మహాలక్ష్మి నగర్‌ ముఖ్యమైంది. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మంది నివాసముంటున్నారు. అనేకేళ్లుగా సురక్షిత తాగునీరు అందక ఇక్కడి స్థానికులు అనారోగ్యాలకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ ఇబ్బందులు అలానే ఉన్నాయి. ప్రతీ వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. పిఠాపురం పురపాలక సంఘంలో అగ్రహారం, మోహన్‌ నగర్‌, కుమ్మరవీధి, మండలంలోని గోకివాడ, జములపల్లి, గండేపల్లి మండలం కె.గోపాలపురం, యల్లమిల్లి దళిత వాడలు ఏటా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పంచాయతీల్లో నిధుల కొరతగ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేధిస్తోంది. 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు కూడా పూర్తిస్థాయిలో లేకుండా పోయాయి. నాలుగేళ్లుగా పంచాయతీలకు విడుదల చేసిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడేసుకొని పంచాయతీ ఖాతాలను ఖాళీ చేసింది. దీంతో కనీస సదుపాయాల కల్పనకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రైనేజీల్లో పూడిక పనులు, సిబ్బంది జీత భత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం వీధి కుళాయి మరమ్మతులకు సైతం సొమ్ములు లేక కష్టాలు పడుతున్న దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేయకుండా అధికారులతో తక్కువ సొమ్ములతో అరకొర ప్రతిపాదనలు చేయిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిధుల తీవ్ర కొరత కారణంగానే పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14.68 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన యంత్రాంగం త్రాగునీటి ఎద్దడి నివారణకు పంచాయతీలపై భారం నెట్టేసింది.

➡️