నేడు హమాలీ కార్మికుల చలో విజయవాడ

Mar 4,2024 23:28
ఈ నెల 5న చలో విజయవాడ

ప్రజాశక్తి – సామర్లకోట

ఈ నెల 5న చలో విజయవాడ కార్యక్రమంలో ఐఎంఎల్‌ డిపో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, స్థానిక డిపో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదినారాయణ, వి.అప్పలరాజు పిలుపునిచ్చారు. సోమవారం డిపో వద్ద జరిగిన ధర్నాలో వారు మాట్లాడుతూ వేతన ఒప్పందం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ చర్చలు ప్రారంభించలేదన్నారు. తక్షణమే ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు బాక్సుకి రూ.10 చొప్పున పెంచాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఇప్పటికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించలేదని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో భాగంగా కార్మికులకు తక్షణం బీమా వర్తింప చేసి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. తమ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, డిమాండ్లు సాధించుకునే అంతవరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి బేవరేజ్‌ హమాలీ యూనియన్‌ ఆధ్వర్యలో కార్మికులు గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో ఉపాధ్యక్షులు విప్పర్తి కొండలరావు, సంఘం గౌరవ అధ్యక్షులు బాలం శ్రీనివాస్‌, అమలకొండ సోమేశ్‌, వెన్నెల గోవింద్‌, పప్పుల సత్తిబాబు, నాళం తిరుమలరావు, శివ, తిరుమలరావు పాల్గొన్నారు.

➡️