పని ఒత్తిడి ఎక్కువ..జీతాలు తక్కువ

Feb 7,2024 23:23
ప్రజల ఆరోగ్య పరిరక్షణ

– సంక్షేమ పథకాలకు దూరం

-నిరంతరం రాజకీయ వేధింపులే

– నేడు ఆశాలు ‘చలో విజయవాడ’

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు చూస్తూ మాతా శిశు మరణాలు తగ్గించడంకోసం కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా వైసిపి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశగా ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో ఆశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు నిలుపుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే తదితర డిమాండ్ల సాధనకు గురువారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, పలువురు కార్యకర్తలను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి అక్రమంగా నిర్భాంధాన్ని ప్రయోగిస్తున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 3 వేల 200 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నిరంతరం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశాలకు కనీస వేతనం కరువైంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోతుంది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయలు రేట్లు దిగిరానంటున్నాయి. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల భారం పేదలపై ఎక్కువగా ఉంది. మరోవైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు ఇతర భారాలు ఆశలపై కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. పనికి తగ్గ జీతాలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.రూ.10 వేలు వేతనం ఇస్తున్నామని గొప్పగా చెబుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర వేతనం కనీసం ఇంటి అద్దెలకు కూడా సరిపోవడం లేదని చెబుతున్నారు. పిల్లల ఫీజులు, పెరిగిన ధరలను అధిగమించి కుటుంబాలను పోషించుకోవాలంటే కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. కోవిడ్‌ కాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందేలా మాపై ఒత్తిడి తీసుకొచ్చినా అనారోగ్యాలకు సైతం గురై పని చేసామని అయితే తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సక్రమంగా అమలు చేయడం లేదని కావునా రూ.5 లక్షలు ఇవ్వాలని, రిటైర్డ్‌ అయిన వారి, మరణించిన వారి కుటుంబాలకు అర్హులైన వారిని ఆశా వర్కర్లుగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా అనేకంగా ఉన్న తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. రాజకీయ వేధింపులతో నిత్యం సతమతమవుతున్నామని, స్థానిక నాయకుల జోక్యం లేకుండా తమ పని చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.అక్రమంగా గృహ నిర్బంధంరాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో సిఐటియు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులను పోలీసులు రెండు రోజులు ముందు నుంచే అక్రమంగా గృహ నిర్బంధం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌ను సామర్లకోటలో తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వెళ్లి స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు ఉంచారు. సామర్లకోట మండలం వేట్లపాలెం సబ్‌ సెంటర్లో పనిచేస్తున్న గౌసి అనే ఆశా కార్యకర్తను వికెరాయపురంలో ఆమె ఇంటి వద్ద నుంచి ఉదయం తీసుకువెళ్లి మధ్యాహ్నం వరకూ సెంటర్లోనే ఉంచి తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శరభవరంలో సత్యా అనే ఆశా వర్కర్‌ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు నోటీసులు ఇచ్చి అక్కడే నిర్బంధించారు. కిర్లంపూడిలో రమణమ్మ అనే ఆశ ఇంటివద్ద బయటకు కదలకుండా పోలీసులు పహారా కాశారు. ఏలేశ్వరం నుంచి చలో విజయవాడ బయలుదేరిన ఐదుగురు వర్కర్లను మార్గం మధ్యలో అడ్డుకుని పోలీస్‌ స్టేషన్లో ఉంచారు. కాకినాడలో పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో టికెట్లు తీసుకుని రైలు ఎక్కిన సుమారు 30 మందిని అడ్డుకుని రామారావుపేట కళ్యాణ మండపంలో నిర్బంధించారు. సాయంత్రం వరకూ ఉంచి ఆ తర్వాత విడిచి పెట్టారు.

➡️