రోడ్డెక్కిన నిరుద్యోగులు

Feb 7,2024 23:16
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న

ప్రజాశక్తి – కాకినాడ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ధర్నా చౌక్‌ వద్ద భారీఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రమం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు పాండవులు దుర్గాప్రసాద్‌ మాట్లా డుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 23 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్‌సిని నిర్వహిస్తామని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా డిఎస్‌సిని తీయకుండా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఎన్నికల ముందు మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు కేవలం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. ఇది పూర్తిగా నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శంచారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని జబ్బలు చరుచుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డి జాబ్‌ క్యాలెండర్‌, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకుండా 99 శాతం హామీలు ఏవిధంగా అమలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశా రు. దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురాగానే దాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా జీవో నెంబర్‌ 117 తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలిపి ప్రాథమిక పాఠశాలలో ఉండే ఉపాధ్యాయ పోస్టులు అన్ని రద్దు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 6,100 పోస్టులతో నిర్వహించే దగా డిఎస్‌సిని ఉపసంహరిం చుకుని, 25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి నోట ిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఆర్‌ఒ డి.నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు టి.రాజా, డిఎస్‌సి అభ్యర్థులు గణేష్‌, భవాని, రామలక్ష్మి, తులసి, రాజేష్‌, రామకృష్ణ, మణికంఠ, పావని, సింహాచలం పాల్గొన్నారు.

➡️