16న జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Jan 26,2024 00:08
కేంద్ర ప్రభుత్వ రైతు

ప్రజాశక్తి – కాకినాడ

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక కచేరిపేటలోని సిఐటియు కార్యాల యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జి అధ్యక్షతన సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో అంబానీ, అదానిలకు దేశ సంపదను దోచుకుంటూ ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, అసం ఘటితరంగ కార్మికులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. 10ఏళ్లలో 1లక్షా 50వేల మంది రైతాంగం వ్యవసాయం గిట్టుబాటుకాక ఆత్మహత్యలకు చేసుకున్నారని, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని, ఇందుకు మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలే కారణమని విమర్శించారు. ఈ విధానాలను ప్రశ్నించే వారిపై మోడీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రజాస్వామిక హక్కులను, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విధానాలను నిరసిస్తూ జనవరి 26వ తేదీ రిపబ్లిక్‌ డే రోజున కాకినాడ భానుగుడి నుండి జరిగే మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో రైతాంగ శ్రేయస్సు కోరే ప్రజాస్వామిక వాదులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంద్‌ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజబాబు, తెలుగుదేశం అనుబంధ రైతు సంఘం నాయకులు జొన్నాడ వెంకట రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, ఎఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కె.అంజిబాబు, కె.వీరన్న తదితరులు పాల్గొన్నారు.

➡️