చాప కింద నీరులా బెట్టింగ్‌

May 16,2024 22:40
జిల్లాలో పొలిటికల్‌ బె

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

జిల్లాలో పొలిటికల్‌ బెట్టింగ్‌ జోరు ఊపందకుంది. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ శాతం పెరగడంతో ఓటరు నాడి అంచనా వేయడం కష్టతరంగా మారింది. అయితే పోలింగ్‌కు ఫలితాలకు మధ్య మూడు వారాల వ్యవధి ఉండటంతో పందెం రాయుళ్లకు వరంలా మారింది. సాధారణ ప్రజల్లో సైతం గెలుపోటములపై చర్చ నడుస్తోంది. ఏ నియోజకవర్గలో ఎవరు గెలుస్తారు అంటూ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చి ప్రస్తుత పోలింగ్‌ సరళి ఎవరికి అనుకూలంగా ఉంటుందో విశ్లేషిస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కేవలం క్రికెట్‌ మ్యాచ్‌లకు పరిమితమైన బెట్టింగ్‌ కల్చర్‌ ఇపుడు రాజకీయాల్లోకి కూడా వచ్చింది.ఉమ్మడి జిల్లా కేంద్రాలు, పిఠాపురంపై జోరు ఉమ్మడి జిల్లా కేంద్రాలైన కాకినాడ, తూర్పు గోదావరి, అమలాపురం నియోజకవర్గాలతో ఆపటు పిఠాపురం నియోజకవర్గం గెలుపుపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ జరుగుతున్న ఈ బెట్టింగ్‌ ఒకటికి నాలుగు వంతులు చొప్పున బెట్టింగ్‌ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మూడు పార్లమెంటు స్థానాలతో పాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్‌లలో అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఫలి తాలపై జనాలకు ఉన్న ఆసక్తికి తమ పార్టీల గెలుపుపై అభిమానులకు, యువకులకు ఉన్న విశ్వాసానికి ఈ పందేలు నిదర్శనంగా మారాయి. కొంత మంది భూములకు మరికొంత మంది లక్షల్లో పందేలు కడుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒకరంటే కాదు మా పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని మరో పార్టీ అభిమానులు సవాల్‌ విసురుతున్నారు. ఇలా పరస్పరం పందేలు కాసుకుంటున్నారు.క్రికెట్‌ నుంచి పాలిటిక్స్‌కుక్రికెట్‌ నుంచి పాలిటిక్స్‌కు బెట్టింగ్‌ జోరు విస్తరించింది. క్రికెట్‌లో ఎవురు టాస్‌ గెలుస్తారో నుంచి ఏ బాల్‌కు సిక్స్‌ ఫోర్‌ కొడతారో అనే అంశాలపై బెట్టింగ్‌ కాస్తారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి మొదలై ఇప్పటి వరకూ అభ్యర్థుల గెలుపోటములు, వారికి వచ్చే మెజారిటీ ఓట్లపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫలానా నాయకుడే గెలుస్తాడు, భారీ మెజారిటీ వస్తుందనే దానిపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కొందరు బెట్టింగ్‌లు రూ.లక్షల్లో కాయగా మరికొందరు ఫలితం వెలువడిన తర్వాత ఓడిపోయిన వారు పార్టీ ఇవ్వాలనే షరుతుల కూడా పెట్టుకుంటున్నారు. మరికొందరు బాండ్‌ పేపర్ల మీద అగ్రిమెంట్‌లు రాయించుకోవటం విస్మయానికి గురి చేస్తోంది. ఎవరికి వారే సొంత సర్వేలుజిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకులు అనుయాయులతో పాటు ప్రైవేట్‌ సంస్థలతో సొంత బృందాలతో సర్వేలు చేయిస్తున్నారు. పోలింగ్‌ రోజున కేంద్రాల నుంచి ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చే వారితో మాట్లాడి నాడి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. మహిళలు, వృద్ధులు, యువత నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేసే సామాజికవర్గాల వారీగా ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపారనేది అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల గణాంకాలు పోలింగ్‌ శాతం, 2024లో నమోదైన పోలింగ్‌ శాతంతో పోల్చి అంచనాలు వేస్తున్నారు.

➡️