పైప్ లైన్ మరమ్మత్తులు

Jan 24,2024 15:49 #Kakinada
commissioner visit water pipe line works

పరిశీలించిన కమిషనర్
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశం
రేపటి నుంచి యధావిధిగా మంచినీటి సరఫరా

ప్రజాశక్తి-కాకినాడ : సామర్లకోట కెనాల్ నుంచి శశికాంత్ నగర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు ముడి నీటిని సరఫరా చేసే పైప్ లైన్ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. అచ్చంపేట సమీపంలోని ఉండూరు వద్ద పైప్ లైన్ ధ్వంసం కావడంతో రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలిగిన నేపథ్యంలో కమిషనర్ అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను బుధవారం పర్యవేక్షించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైప్లైన్ డామేజ్ కావడం వల్ల శశికాంత్ నగర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిధిలోని సుమారు ఎనిమిది డివిజన్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. రమణయ్య పేట, బొందగుంట, కొండేలుపేట, డి-మార్ట్, దుమ్ములపేట, పర్లోపేట, రాజీవ్ గృహకల్ప వంటి ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో సమస్య తలెత్తిందన్నారు. ఈ కారణంగా ఆయా డివిజన్ల ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ విభాగం వద్ద అందుబాటులో ఉన్న ఆరు మంచినీటి ట్యాంకర్లతో పాటు మరో 6 అదనపు ట్యాంకర్లను కూడా సమకూర్చి మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పైప్ లైన్ మరమ్మత్తు పనులను మరింత వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఉదయం నుంచి శశికాంత్ నగర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిధిలోని ప్రజలకు యధావిధిగా మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల ప్రగతిని ఎస్ఈ పి.సత్య కుమారి కమిషనర్ కి వివరించారు. కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ ఈఈ మాధవి, ఏఈ రమేష్, వాటర్ వర్క్స్ సిబ్బంది ఉన్నారు.

➡️