గోదావరి జలాల కలుషితం

Jun 17,2024 22:44
గోదావరి కాలువ కాలుష్య

ప్రజాశక్తి – సామర్లకోట

గోదావరి కాలువ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలు సాగు, తాగు నీటి కోసం సరఫరా అయ్యే గోదావరి నీటిని కలుషితం చేస్తున్నాయి. అయినా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలతో కూడిన నీటిని కాస్తంత శుభ్రం చేసి ప్రజలకు అవసరమైన తాగునీటిగా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నెలకుంది. కళ్లెదుటే ఇంతటి దారుణ పరిస్థితి కన్పిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖరీఫ్‌ సాగు ప్రారంభానికి రైతులు సిద్ధ మయ్యారు. దీంతో గోదావరి జలాలలను ఇటీవల కాలంలోనే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి విడుదలకు శ్రీకారం చుట్టారు. తూర్పు డెల్టా కాలువకు గోదావరి జలాలు విడుదల అయ్యా యి. గోదావరి నుంచి విడుదల చేసిన నీరు సామర్లకోట లాకుల సమీపానికి చేరుకుంది. సాగు, తాగు నీటికి ఇబ్బంది ఉండదనే ఆలోచనలతో ఉన్న రైతులను, ప్రజలను ఆ నీటి ప్రవాహంలో వస్తున్న రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. సామర్లకోట సమీపంలోని కెనాల్‌ రోడ్డు వెంబడి ఉన్న పలు పరిశ్రమల నుంచి విడుదలైన రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలు గోదావరి నుంచి విడుదలైన నీటిలో నేరు గా కలుస్తున్నాయి. దీంతో గోదావరి తూర్పు డెల్టా కాలువలో నీరు పూర్తిగా కలుషితం అయ్యిపోయింది. నలుపు రంగులో మారిపోయి దుర్గంధం వెదజల్లుతూ నీటి ప్రవాహం ఉంది. ఈ నీటినే పశువులకు, వ్యవసాయ సాగుతోపాటు, పెద్దా పురం, సామర్లకోట పట్టణ ప్రజలకు తాగునీటిగా సరఫరా చేయనున్నారు. రసాయనాలతో కూడిన జలాలను వినియో గిస్తే ప్రజల ఆరోగ్యాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గోదావరి కొత్త జలాల కోసం సామర్లకోట, పెద్దాపురం పట్టణాలతోపాటు, కాకినాడ నగరాల అధికారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలు విడుదలైనా అవి రసాయనాలతో కూడిన వ్యర్థపు జలాల్లో కలిసి ప్రవహించడం అధికారులను దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టుతోంది. వ్యర్థ జలాలనే శుద్ధి చేసి తాగునీటిగా సరఫరా చేస్తే ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

➡️