కలెక్టరేట్ వద్దకు ధర్నాస్థలి మార్చాలి

Jan 26,2024 12:52 #Kakinada
protest for dharna place kkd

సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు జాతీయ జెండాతో నిరాహార దీక్ష

ప్రజాశక్తి-కాకినాడ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పు టేరు ధర్నాస్థలిని కలెక్టరేట్ వద్దకు మార్పు చేసే చర్యలకు జిల్లా కలెక్టర్, ఎస్ పి సమన్వయ సమావేశం నిర్వహించి ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు కోరారు. ఈమేరకు అంబేడ్కర్ సెంటర్ ఉప్పుటేరు పార్కు వద్ద జాతీయ జెండాతో నిరాహారదీక్ష చేపట్టారు. ధర్నాస్థలి పై జిల్లా అధికార యంత్రాంగం స్పందించే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఇక్కడ దీక్ష కొనసాగించడం అభద్రతకు పరాకాష్టగా వున్న విషయం ఇంటెలి జెన్స్ వర్గాలు గ్రహించి ముఖ్యమంత్రికి తెలియ జేయాలన్నారు. రక్షణ కరువైన ధర్నాచౌక్ వద్ద దీక్ష చేయడం ఎంత ప్రమాదకరమో తెలిసిన సామాన్యుడు సామాజిక వెతలపై ముందుకు రావడానికి సాహసం చేయలేక పోతున్నారన్నారు. కలెక్టరేట్ వద్దకు వెళితే కేసులు దాఖలు చేసి కోర్టులకు ఈడుస్తున్న దుస్తితి ఎదుర్కోవాల్సిన అగత్యం తీసుకువచ్చారన్నారు. దొమ్మీగా వెళ్ళే సాహసం సామాన్యుడు చేయలేడన్నారు. కలెక్టరేట్ వద్ద పాతిక మందికి మించకుండా ధర్నాస్థలి కొనసాగించే వెసులుబాటు సామాన్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రెండేళ్ల క్రిందట సమగ్ర సమాచారం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం చేయకుండా అప్పటి ఆర్ డి వో దృతరాష్ట్ర చందంగా సమావేశ సంతకాలు ప్రోది చేసి 2022 జనవరి లో కలెక్టరేట్ నుండి ధర్నా స్థలిని దూరం చేశారని పేర్కొన్నారు. సామాన్యులు తమ కష్టాలు ఎదురవుతున్న సమస్యల గురించి ఉప్పుటేరు వద్ద స్మశాన రోదన చేసుకోవాల్సిన దుస్తితి ఏర్పడిందన్నారు. ఉప్పుటేరు ధర్నాస్థలివద్ద సిసి కెమెరాల నిర్వహణ లేకపోవడం, పోలీస్ అవుట్ పోస్ట్ కొరవడటం, కలెక్టరేట్ సభార్డినేట్ ఉద్యోగిని నియమించక పోవడం, ప్రెస్ షెల్టర్ ఏర్పాటు లేకపోవడం, ధర్నా స్థలి నుండి కలెక్టరేట్ లోకి వెళ్లి వినతి ఇవ్వడానికి సామాన్యులకు గగనతరం కావడం, జవాబుదారీ లేకపోవడం, నగర ముఖ ద్వారమైన ట్రాఫిక్ రోడ్డు జంక్షన్ లో అవస్థలు పెంచడం, ఇక్కడి తోటగోపాలకృష్ణ మున్సిపల్ పార్కు వినియోగం అభివృద్ధిలేకుండా దుర్వినియోగం చేయడం, పార్కు వరసలో వున్న మహావీర్ విగ్రహ ప్రాంగణం అనుచితంగా మారడం, బాలాజీ చెరువు జంక్షన్ నుండి మార్పు చేసిన టాక్సీ స్టాండ్ కు ఇబ్బందులు కలిగించడం, స్ట్రీట్ వెండర్స్ కు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం, సీనియర్ సిటిజన్స్, మహిళలు ఈ రహదారిలో ప్రయాణించే మార్గం కోల్పోవడం వంటి పలు అవస్థలు పెరిగాయన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి నుండి కాకినాడ జిల్లా వేరుపడిన తరువాత కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సంఖ్య తగ్గిందన్నారు. పలు దఫాలుగా కలెక్టరేట్ గ్రీవెన్స్ పిర్యాదులు జిల్లా ఎస్ పి ని స్వయంగా కలిసిన సమావేశాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అధికార యంత్రాంగం నుండి సానుకూలత వ్యక్తమైనప్పటికీ అమలులో ధర్నా స్థలి మార్పుకు చర్యలు చేపట్టే సమావేశం జరగలేదన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్ పి సమావేశమై ధర్నాస్థలి మార్పుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తన దీక్ష ప్రజాస్వామ్యహితంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

➡️