ధాన్యం కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ

Apr 3,2024 22:21
ధాన్యం కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ

ప్రజాశక్తి- యంత్రాంగంతాళ్లరేవు ప్రభుత్వం ద్వారా ఈ నెల 4వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు తహశీల్దారు ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో ఎఒ ప్రశాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 11 రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులతో స్నేహపూర్వకంగా మాట్లాడి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన గోనెసంచులు, తేమ శాతం నిర్ధారణ, బయోమెట్రిక్‌ యంత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రతి రైతుకూ తాను పండించి తీసుకువచ్చిన ధాన్యం రకం వివరాలు పోర్టల్‌లో పొందుపరచాలన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన కఠిన చర్యలు తప్పవు అన్నారు. యు.కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వి.జోగిరాజు సూచించారు. గురువారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించాలన్నారు జిపిఎస్‌తో కూడిన వాహనాల రిజిస్ట్రేషన్‌, తేమ శాతం చూసే విధానం, గోనె సంచులు లభ్యతపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిటి మురళీకృష్ణ, విఎఎలు, సొసైటీ సిఇఒలు పాల్గొన్నారు.పిఠాపురం పట్టణంలోని మండల కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఎడిఎ పి.స్వాతి, తహశీల్దార్‌ పి.లక్ష్మి రైతులకు ఎఫ్‌టిఒల ద్వారా రసీదులు ఇచ్చే విధానాన్ని, మిల్లులకు తరలించేందుకు రైతులకు గొనె సంచులు మంజూరు చేసే విధానాన్ని వివరించారు. ప్రభుత్వ మద్దతు ధర కన్నా వ్యాపారులు అధికంగా చెల్లించి ధాన్యం కొనేట్లయితే ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ శిక్షణలో వ్యవసాయ అధికారి ఎ.అచ్యుతరావు, సిబ్బంది పాల్గొన్నారు. కాజులూరు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని తహశీల్దారు శాంతిలక్ష్మి తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వ్యవసాయ అధికారి ఎ.అశోక్‌ అధ్యక్షతన 21 ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గురువారం నుండి నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతు భరోసా కేంద్ర సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎప్పటికప్పుడు పంట కోత, దిగుబడిని అంచనా వేసి ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయకులు సురేష్‌, ప్రకాష్‌, దుర్గాప్రసాద్‌, ప్రసన్న, నాగేంద్రరావు, శిరీష, కనకదుర్గ సిబ్బంది పాల్గొన్నారు.

➡️