Parliament: ఎంపిల ప్రమాణ స్వీకారం

Jun 24,2024 23:13 #AP MP, #oath, #Parliament Session

 తెలుగులో 15 మంది.. ఇంగ్లీష్‌లో ఏడుగురు
 హిందీలో ఒకరు, సంస్కృతంలో ఒకరు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం లోక్‌సభలో ప్రొటెం స్పీకరు భర్తృహరి మెహతాబ్‌ కొత్తగా ఎనిుకైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెహతాబ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. మెహతాబ్‌ తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించగా, తరువాత ప్రొటెం స్పీకర్ల ప్యానెల్‌ సభ్యులు రాధామోహన్‌ సింగ్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత రాష్ట్రాలకుచెందిన సభ్యుల ప్రమాణ స్వీకారం అక్షర క్రమంలో కొనసాగింది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఎంపిలు ప్రమాణ స్వీకారం చేయగా, మంగళవారం తెలంగాణ ఎంపిలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణకుచెందిన కేంద్ర మంత్రులు జి కిషన్‌ రెడ్డి, బండి సంజరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగులో 15 మంది ప్రమాణ స్వీకారం
ఎపికి చెందిన ఎంపిల్లో ముగ్గురు మంత్రులు, 12 మంది ఎంపిలు తెలుగులోనూ, ఏడుగురు ఇంగ్లీష్‌లోనూ, ఒకరు హిందీ, ఒకరు సంస్కృతంలోనూ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు, టిడిపి ఎంపిలు కె రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బిజెపి ఎంపి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో టిడిపి ఎంపిలు కలిశెట్టి అప్పలనాయుడు, ఎం శ్రీభరత్‌, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి, బికె పార్థసారధి, బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, దగ్గుమల్ల ప్రసాద్‌రావు, వైసిపి ఎంపి గురుమూర్తి, బిజెపి ఎంపి పురందేశ్వరి, జనసేన ఎంపి వల్లభనేని బాలశౌరి ప్రమాణ స్వీకారం చేశారు. వైసిపి ఎంపి తనూజరాణి హిందీలోనూ, టిడిపి ఎంపి తెన్నేటి కృష్ణప్రసాద్‌ సంస్కృతంలోనూ ప్రమాణ స్వీకారం చేశారు. ఏడుగురు ఎంపిలు ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 25 మంది ఎంపిలకు 24 మంది ప్రమాణ స్వీకారం చేయగా, కడప ఎంపి అవినాష్‌ రెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి జి కిషన్‌ రెడ్డి, విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు పంచకట్టుతో ప్రమాణ స్వీకారం చేశారు. కలిశెట్టి అప్పలనాయుడు పసుపు రంగు కుర్తా, పైజామాతో పసుపు రంగు సైకిల్‌ తొక్కుకుంటూ ఢిల్లీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసం (అశోక్‌ రోడ్డు 50) నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు.

➡️