ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సమీక్ష

Feb 13,2024 17:58

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌ నందు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌) పబ్లిక్‌ పరీక్షలు నిర్వహణ కోసం నియమింపబడిన హైపవర్‌ జిల్లా కమిటీతో కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (ఓపెన్‌) పబ్లిక్‌ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘట నకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు 1,376 మంది హాజరు అవుతారని వీరికి ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశ పరీక్షలకు 5,199 మంది ప్రాక్టికల్‌ పరీక్షలకు 3,649 మంది హాజరవుతారని వీరి కొరకు 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రెవెన్యూ విభాగం వారు పరీక్షా కేంద్రాల వద్ద144 సెక్షన్‌ విధించడం పోలీస్‌ విభాగం వారు శాంతిభద్రతల పరిరక్షణ ప్రశ్నావళి జవాబు పత్రాల తరలింపులో సెక్యూరిటీని నియమించాలన్నారు. అదేవిధంగా పోలీస్‌ స్టేషన్లో ప్రశ్నా వళి పత్రాలు భద్రపరచాలన్నారు. విద్యాశాఖ రెవిన్యూ శాఖ పోలీసు విభాగం అధికారులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ గా ఏర్పాటు కావాలన్నారు. పరీక్షా కేంద్రాల రహదారులలో ఆర్‌టిసి వారు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక చికిత్స కిట్‌, ఓఆర్‌ఎస్‌ ద్రావణం ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పోస్టల్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు జవాబు పత్రాల బండిల్సు భద్రపరచాలన్నారు. సార్వత్రిక విద్యాపీఠం టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 13 నుంచి మార్చి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు జెడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, డిఇఒ ఎం.కమల కుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️