కాలుష్యంతో పట్టణ ప్రజలు అవస్థలు

Feb 28,2024 16:47

మండపేట కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న కో ఆప్షన్‌ సభ్యులు రాజబాబు

ప్రజాశక్తి-మండపేట

పట్టణ పరిధిలోని రైస్‌ మిల్లులు, పలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సాధారణ సమావేశం మున్సిపల్‌ చైర్పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో పొందుపరిచిన ఆశీల పాటకు సంబంధించిన అంశం కౌన్సిల్‌ దృష్టికి వచ్చినపుడు కౌన్సిలర్‌ చుండ్రు సుబ్బారావు చౌదరి, కో ఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు, పిల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ వేలం జరిగిన అనంతరం పాటదారులు ఇష్టం వచ్చినట్లు చిన్న వీధి వ్యాపారుల వద్ద ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం నుండి ఇలా జరుగుతోందని గెజిట్‌ ప్రకారం వసూలు చేసేవిధంగా బోర్డులు పెట్టాలన్నారు. 2005 సంవత్సరం నుంచి పట్టణంలో కాలుష్యం సమస్య వుందని గత పాలకవర్గం సమావేశాలలో ఇదే విషయంపై ప్రశ్నించామని అప్పుడు రైస్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు జరిగిందని సమస్య పరిష్కారానికి మిల్లర్లు ముందుకు వచ్చారని అనంతర చర్యలు చేపట్టకపోవడంతో సమస్య కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. అధికారులు సమస్య పరిష్కరించడలేదన్నారు. మార్కెట్‌, వివిధ వస్తువుల కొనుగోలుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కలువపువ్వు సెంటర్‌ లో టాయిలెట్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం కమిషనర్‌ రాము మాట్లాడుతూ తరువాత సమావేశానికి పొల్యూషన్‌ అధికారులు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

➡️