Protest :శిరోముండనంతో వైసిపి మాజీ కార్పొరేటర్‌ నిరసన

  • ఎమ్మెల్యే బోండా రాజకీయ కక్షసాధింపుతో భవనాన్ని కూల్చివేయించారని ఆరోపణ

ప్రజాశక్తి – విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ తన భవనాన్ని కూల్చివేయించారని మాజీ కార్పొరేటర్‌ నందెపు జగదీష్‌ సోమవారం స్వయంగా శిరోముండనం చేయించుకొని నిరసన తెలిపారు. అర్థనగ ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గంలో బోండా గుండాగిరి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 15న విజయవాడ పాయకాపురం ప్రకాష్‌ నగర్లో విజయవాడ-నూజివీడు రహదారిపై ఉన్న మాజీ కార్పొరేటర్‌, విఎంసిలో వైసిపి కో ఆప్షన్‌ సభ్యుడు జగదీష్‌కు చెందిన భవనాన్ని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారనే పేరుతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. గత ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేశాననే కోపంతోనే బోండా ఉమా అనుచరుల సమక్షంలో విఎంసి అధికారులు జెసిబిల సాయంతో తన భవనాన్ని కూల్చివేశారని జగదీష్‌ ఆరోపిస్తూ కూల్చేసిన భవనం ముందు సోమవారం శిరోముండనం చేయించుకున్నారు. మీసాలు కూడా తీయించుకుని, చేతులు కట్టేసుకుని అర్ధనగంగా నిరసన తెలిపారు. తన భార్యకు సైతం శిరోముండనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో తాను టిడిపిలో ఉన్నప్పుడు ఈ భవవాన్ని అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహస్త్రశ్వరరావే ప్రారంభించారని తెలిపారు. దళిత నాయకుడినైన తాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేశాననే అసూయతోనే తన భవనాన్ని ఎమ్మెల్యే కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు న్యాయం చేయకపోతే తన కుటుంబ సభ్యులంతా శిరోముండనం చేయించుకుని నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 

➡️