మంత్రిని అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా : రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టినా తమ జిల్లాకు మాత్రం తాను కూలీగా పని చేస్తానని ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్‌ కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణిశ్రీ, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుబాటి వెంకట ప్రసాద్‌, ఎమ్మెస్‌ రాజు, జేసీ.అస్మిత్‌ రెడ్డి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‌ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు జి.వెంకట శివుడు యాదవ్‌ లు ఘన స్వాగతం పలికారు. మంత్రి బాటసుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పట్టణంలోని పత్తికొండ రోడ్డు కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై మంత్రి రోడ్‌ షో నిర్వహించారు. మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుత్తికి వచ్చిన మంత్రికి టిడిపి శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్‌ మాట్లాడుతూ …. సిఎం నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో ఆర్థిక శాఖను అప్పగించారని అన్నారు. ఇంకా ఆర్థిక శాఖకు సంబంధించి ఖజానా పుస్తకాలు తెరవలేదని గత ఐదేళ్లలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అభివఅద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు. తాను ఆరాటాలు, పోరాటాల మధ్య పెరిగానని అన్నారు. రైతులు పడ్డ కష్టాలు తనకు తెలుసునన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సాగునీరు, తాగునీటి కోసం అనేక పోరాటాలు చేశానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుమ్మనూరు నారాయణ, సర్పంచ్‌ పి.భరత్‌ కుమార్‌, ఎంపీటీసీలు ధనుంజయ, నారాయణస్వామి, నాయకులు ఎంకె.చౌదరి, ఎన్‌.కేశవ నాయుడు, రవితేజ నారాయణస్వామి, పి. రవితేజ,ఎన్‌.సూర్య ప్రతాప్‌, దిల్కాశీనా, ఎస్‌ఎం.భాష, పి.సుధాకర్‌, చిన్న వెంకటస్వామి, పిల్లెల్లి కఅష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️