డెల్టా ఆధునికీకరణకు అడుగేదీ..!

Apr 1,2024 23:03
డెల్టా ఆధునికీకరణకు అడుగేదీ..!

ప్రజాశక్తి – ఆత్రేయపురంకోనసీమ జిల్లాలో 16 మండలాల్లోని పంట పొలాలకు సుమారు 2.10 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగు, తాగునీరందించే లొల్ల లాకుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. అపర భగీరథుడు ఆర్థర్‌ కాటన్‌ 1881లో నిర్మించిన లొల్ల లాకుల వ్యవస్థకు ప్రమాదం పొంచివుంది. బ్రిటిష్‌ కాలంలో కట్టిన లాకులే నేటికీ కోనసీమ జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నాయి. గోదావరి మధ్య డెల్టా కాలువ నుంచి లొల్ల లాకుల వద్ద ముక్తేశ్వరం బ్యాంక్‌ కెనాల్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా 16 మండలాలకు సాగు, తాగు నీరందిస్తోంది. ఈ లాకులు శిథిలావస్థకు చేరడంతో కూలిపోయేందుకు సిద్ధంగా ఉండడంతో లాకుల మీద భారీ వాహనాలు సైతం వెళ్లకుండా నిలువ చేశారు. పునర్మించేందుకు రూ.52 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పదేళ్లు పైనే కావస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముందుకు వస్తుందోనన్న ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ గతంలో లొల్ల లాకులను పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఎంతమంది కలెక్టర్లు మారినా లాకులు అభివృద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు మాత్రం రూ.52 కోట్లతో లాకులను పునర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నత అధికారులకు నివేదించామని అనుమతులు రాగానే పనులు చేపడతామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెలలో కాలువలకు నీటిని నిలుపుదల చేసి మళ్లీ జూన్‌ మొదటి వారంలో కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఈ రెండు నెలల సమయంలో లాకులకు మరమ్మతులు గ్రీజు వంటి పనులు చేపట్టాలి. దీనికోసం ప్రతి ఏడాది మెయింటినెన్స్‌ నిధులు రాకపోవడంతో కనీసం లాకులు షట్టర్లకు గ్రీజు కూడా పెట్టే పరిస్థితి లేదు. లస్కర్‌లే తమ సొంత ఖర్చులతో గ్రీజును పెడుతున్నారు. కాలువకు సాగునీటిని విడుదల చేయాలన్నా తగ్గించాలన్నా షట్టర్లను పైకి కిందికి దించాలి. లాకుల తలుపులు తుప్పు పట్టడంతో లస్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. లొల్ల ప్రధాన లాకులకు ముప్పు వాటిల్లితే రాష్ట్రంలోనే ధాన్యాగారంగా పేరుందిన కోనసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పంట పండించి చేతికొచ్చే సమయానికి ప్రకృతి ఏదో రూపంలో దెబ్బ తీయడంతో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమంది రైతులు తమ విలువైన పంట భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లొల్ల ప్రధాన లాకులను పునర్మించాలని రైతులు కోరుతున్నారు.

➡️