బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు సాయం

Mar 13,2024 22:56
బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు సాయం

ప్రజాశక్తి-అమలాపురందేశంలోని 500 మండలాలకు సంబంధించి బలహీన వర్గాలకు చెందిన ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్‌ సపోర్టు మంజూరు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. బుధవారం ప్రధాన మంత్రి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణ సహాయం కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా చేరువయ్యే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం అణగారిన వర్గాలకు ప్రాధాన్యత మోడీ గ్యారెంటీ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం కార్యక్రమాన్ని ప్రారంభిం చిందన్నారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వపు శాఖ ఆధ్వర్యంలో అణగారిన ఎస్‌సి, ఒబిసి పారిశుధ్య కార్మిక వర్గాలకు చెందిన లక్ష మందికి రుణాలు కల్పించే దిశగా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి రూపొందించారన్నారు. ప్రధాన మంత్రి సమాజిక్‌ రోజ్‌గార్‌ అధారిత్‌ జనకళ్యాణ్‌ ప్రధానమంత్రి సూరజ్‌ జాతీయ పోర్టల్‌ను ప్రధాన మంత్రి ప్రారంభించారన్నారు. దేశంలోని బలహీన వర్గాలకు చెందిన ఒక లక్ష మంది పారిశ్రామిక వేత్తలకు క్రెడిట్‌ సపోర్టు మంజూరు చేస్తారన్నారు. అదనంగా, షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతులు పారిశుధ్య కార్మికులతో సహా వెనుకబడిన వర్గాల నుండి వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషించారు. వెనుక బడిన వర్గాలకు క్రెడిట్‌ మద్దతు కోసం జాతీయ పోర్టల్‌ బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రధాన మంత్రి నిబద్ధత ఈ కార్యక్రమం ద్వారా ప్రతిబింబించిందన్నారు. ఇది సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి ఉద్దేశించిన ఒక పరివర్తనాత్మక చొరవని బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సి, ఎంఎఫ్‌ఐలు ఇతర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన వ్యక్తులకు క్రెడిట్‌ సపోర్ట్‌ అందిస్తామన్నారు. నేషనల్‌ యాక్షన్‌ ఫర్‌ మెకనైజ్డ్‌ శానిటేషన్‌ ఎకోసిస్టమ్‌ (నమస్తే) కింద సఫాయి మిత్రలకు (మురుగు సెప్టిక్‌ ట్యాంక్‌ కార్మికులు) ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డ్‌లు, పిపిఇ కిట్‌లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారన్నారు. ఈ చొరవ సవాల్‌తో కూడిన పరిస్థితులలో పని చేసే ఫ్రంట్‌లైన్‌ కార్మికుల ఆరోగ్యం భద్రతను కాపాడే దిశగా మరో అడుగును సూచిస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలకు రుణసహాయం కోసం దేశవ్యాప్తంగా విస్తత ప్రచారం కల్పించే కార్యక్రమంలో వెనుకబడిన వర్గాల లక్ష మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్‌ రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 43 మంది శ్రీనిధి మహిళ సభ్యులకు రూ.32 లక్షల 35 వేలు, నేదునూరు ఇండియన్‌ బ్యాంకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఐదుగురికి రూ.5 లక్షల విలువైన చెక్కులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, ఎల్‌డిఎం కె.శ్యాంబాబు, పురపాలక సంఘ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వక్స్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి జ్యోతిలక్ష్మి దేవి, బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సాంబమూర్తి పాల్గొన్నారు.

➡️